పటాన్చెరు, నవంబర్ 20: కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగుతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తంగి గ్రామంలో జాతీయ రహదారిపై మురుగు పారుతున్నది. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ముత్తంగి పంచాయతీ విలీనం చేసిన తర్వాత పారిశుధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామాన్ని రెండు నెలల క్రితం తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆ తర్వాత ప్రజలకు పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి.
తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆర్సీపురం మండలంలో ఉండటంతో ముత్తంగివాసులకు అన్ని రకాల సేవలు దూరభారంగా మారాయి. జాతీయ రహదారిని విస్తరిస్తూ ఒకవైపు నిర్మాణ సంస్థ పనులు చేస్తున్నది. బాక్స్‌టైప్ డ్రెయిన్లు నిర్మించేందుకు జేసీబీతో నిర్మాణ సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ముత్తంగిలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పలుచోట్ల పగిలిపోయింది. అటు కాంట్రాక్టర్ ఆ మురుగు సమస్యకు దారి చూపకపోవడం, మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది దానికి ఎలాంటి పరిష్కారం ఆలోచించకపోవడంతో మురుగు నేరుగా జాతీయ రహదారిపై నుంచే ప్రవహిస్తున్నాయి. నెలరోజులుగా మురుగు జాతీయ రహదారిపై దుర్వాసన వెదజల్లుతూ ప్రవహిస్తున్నా, మున్సిపాలిటీ సిబ్బందికి కనబడడంలేదు.
జాతీయ రహదారి విస్తరణ కాంట్రాక్టర్ ద్వారా ఇప్పటికే మంచినీటి పైప్లైన్లు పలుమార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మురుగు పైప్లైన్లు పగిలిపోయాయి. జాతీయ రహదారి పక్కనుంచి జేసీబీ ద్వారా తాత్కాలికంగా నాలా ఏర్పాటు చేసినా, మురుగునీరు నేరుగా ఎన్‌కె చెరువు నాలా ద్వారా నక్కవాగు వైపు వెళ్లిపోతాయి. మరోపక్క ముత్తంగిలోని పలు కాలనీల్లోను మురుగు నిండి రోడ్లపై పరుగులు తీస్తున్నది. న్యూటౌన్ కాలనీలో నెలరోజులుగా డ్రెయిన్లు పొంగి ఓపెన్ ప్లాట్లలో నీరు నిలిచిపోయింది. కాలనీ ప్రజలు దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్నారు. పారిశుధ్యంపై, మురుగు సమస్యపై సిబ్బంది దృష్టిపెట్టకపోవడంతో సమస్య తీవ్రతరం అవుతున్నది. మరోపక్క తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో కార్లు, ద్విచక్రవాహనాలు పడిపోతున్నాయి. జాతీయ రహదారిపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ప్రయాణిస్తున్న మురుగు సమస్యకు పరిష్కారం లభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.