ఒక ఇరుకు రేకుల గదులు..ఆ గదుల్లోనే చుట్టూరా బస్తా లు, ట్రంకు పెట్టెలు..ఎదురుగా గోడకు బ్లాక్‌బోర్డు..ఒక్కో ఇరుకు గదిలో 35 మంది విద్యార్థులు. పగటి పూట బస్తాలు, ట్రంకుపెట్టెల మధ్య నేలపై కూర్చుని పాఠాలు వింటారు. ఏకాగ్రతతో కాదు ముక్కులు మూసుకుని చదువుకుంటారు. తరగతి గదుల పక్కనే టాయిలెట్లు ఉండటంతో అక్కడి నుంచి వచ్చే దుర్గంధం భరించలేక విద్యార్థులు ముక్కుమూసుకుని కూర్చుంటున్నారు.
అదే రేకుల గదిలో ఫ్యాన్ లేక ఉక్కపోస్తున్నా..రేకులకు చిల్లులు పడి వర్షానికి నీళ్లు కురుస్తున్నా పగటిపూట చదువు, రాత్రిపూట నిద్రపోతారు. పగటిపూట తరగతి గదులే రాత్రిపూట డార్మెట్రీలుగా మారుతాయి. ఇదంతా ఎక్కడే మారుమూల గురుకుల పాఠశాలలో పరిస్థితి కాదు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాల దుస్థితి ఇది. సరైన మౌలిక వసతులు లేక అద్దె భవనాల్లో బీసీ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు పడుతున్న అవస్థలకు సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాల అద్దం పడుతున్నది.
సంగారెడ్డి,ఆగస్టు10(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో 11 గురుకుల పాఠశాల లు, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఆరు బాలికల, నాలుగు బాలుర కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఉంది. సంగారెడ్డిలోని ప్రశాంతనగర్‌లో 5 నుంచి 9 తరగతి వరకు బీసీ గురుకుల పాఠశాల ఉంది. జిల్లా పరిషత్ అతిథి గృహంలో బీసీ బా లుర హాస్టల్ కొనసాగుతున్నది. దీనికి ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. బీసీ గురుకుల పాఠశాలలో మొత్తం 336 మంది విద్యార్థులు ఉన్నారు.
వీరంతా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలలో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. గురుకుల పాఠశాలలో రెండు భవనాలు, ఐదు గదులు ఉన్న ఒక రేకుల షెడ్ ఉంది. ప్రధాన భవనంలో ఆఫీసు కార్యాలయం, కిచెన్, ఆర్వో ప్లాంట్ ఉండగా, మరోభవనంలో ఆరు తరగతి గదులు ఉన్నాయి. ఆ గదుల్లోనే విద్యార్థులు పగటిపూట చదువుకోవడంతో పాటు రాత్రిపూట అదే గదుల్లో నిద్రపోతారు. మరోవైపు రేకుల షెడ్డులో ఐదు తరగతి గదులు ఉన్నాయి. ఇందులో సైతం పగటిపూట ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు. రాత్రిపూట అదే గదుల్లో విద్యార్థులు నిద్రపోతారు.
బీసీ గురుకుల పాఠశాలలో 336 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతి గదులు, డార్మెట్రీలు లేవు. తరగతి గదులే వారికి రాత్రిపూట బసచేసే డార్మెట్రీలు. 5 నుంచి 9వ తరగతి వరకు ఒక్కోగదిలో 30 నుంచి 35 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆఫీ సు కార్యాలయానికి ఎదురుగా ఉన్న భవనంలో ఆరు గదులు ఉన్నాయి. ఒక్కో గది నే తరగతి గదిగా, డార్మెటరీలు మార్చారు. విద్యార్థులు తమతోపాటు తీసుకువచ్చిన ట్రంక్ పెట్ట్టెలు, బస్తాలు, పుస్తకాల బస్తాల ను అదే గదిలో పెట్టుకున్నారు. దీంతో తరగతి గదులు ఇరుకుగా మారాయి. అయినప్పటికీ అదే గదుల్లో ఉపాధ్యాయులు పగటి పూట పాఠాలు బోధిస్తున్నారు. రాత్రివేళల్లో అదే ఇరుకు గదుల్లో విద్యార్థులు నిద్రపోతున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల గేటు పక్కగానే రేకులతో ఐదు తరగతి గదులు ఏర్పాటు చేశారు.
ఈ గదుల్లో 7,8,9వ తరగతి విద్యార్థులు చదువుకోవడంతో పాటు ఆ గదుల్లోనే రాత్రి నిద్రపోతున్నారు. ఇరుకైన ఐదు గదుల్లోనే విద్యార్థులు తమ ట్రం క్ పెట్ట్టెలు, బస్తాలు పెట్టుకుంటారు. పగటిపూట అదేగదుల్లో విద్యార్థులు పాఠాలు వినటం, రాత్రిపూట నిద్రపోతున్నారు. ఇరుకైన గదుల్లో 30 మందికిపైగా విద్యార్థులు ఉండటంతో నిద్రపోయే సమయం లో ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు రేకులతో ఉండడంతో ఎండలు బాగా కాసినప్పుడు ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గదుల్లో పైక ప్పు రేకులు అక్కడక్కడా చిల్లులు పడ్డాయి.
చిల్లులు ఉండటంతో వర్షం కురిసినప్పుడు వర్షం నీరు పడుకున్న విద్యార్థులపై పడుతున్నది. దీంతో విద్యార్థులు ప్లాస్టిక్ కవర్లు పెట్టి వర్షంనీరు పడకుండా చూసుకుంటున్నారు. 8,9 తరగతి గదుల పక్కనే టాయిలెట్లు ఉండటంతో అక్కడి నుంచి వచ్చే దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకుని పగలు పాఠాలు వినాల్సిన దుస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక దోమలు కుట్టి విషజ్వరాల బారినపడే ప్రమాదం ఉందని గురుకుల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తరగతి గదులు, డార్మెటరీలు లేకపోవటంతో ఇరుకైన గదుల్లో ఒకేచోట విద్యాభ్యాసం, ఒకేచోట నిద్రపోవాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో డైనింగ్‌రూమ్ లేక విద్యార్థులు నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో క్రీడల కోసం పీడీ ఉన్నప్పటికీ క్రీడా మైదానం లేదు.
సంగారెడ్డిలోనే బీసీ గురుకుల పాఠశాల ఒక్కటే కాదు మిగతా పది బీసీ గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన మౌలిక వసతులు లేకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఆరు బాలికల గురుకుల కళాశాలలు, నాలుగు బాలు ర కళాశాలలు ఉన్నాయి. పది గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యి. సంగారెడ్డికి మంజూరైన బీసీ మహి ళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రస్తుతం వర్గల్లో కొనసాగుతున్నది.
సంగారెడ్డి జిల్లా లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కనీ సం అద్దె భవనం అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో మహిళా డిగ్రీ కళాశాల వర్గల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది గురుకుల పాఠశాలలు, కళాశాలలకు కేసీఆర్ సర్కార్ సొంత భవనాల నిర్మా ణం కోసం స్థలాలను కేటాయించింది. గు రుకులాలు మంజూరైన చోటనే కేసీఆర్ స ర్కార్ ఐదు నుంచి ఎనిమిది ఎకరాల వర కు స్థలం కేటాయించింది. శాశ్వత భవనాల నిర్మాణం చేపడితేనే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.