తూప్రాన్, డిసెంబర్ 28: మండలంలోని వెంకటాపూర్ (పీటీ)లో నిర్వహిస్తున్న శ్రీలలితా పరమేశ్వరీ దేవి సహస్ర చండీ యాగంలో పాల్గొనేందుకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. లిలితా పరమేశ్వరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేద స్వస్తితో పూజలు ఆరంభమయ్యాయి.
అనంతరం స్థాపితా దేవతా హవనాలు, సహస్ర బ్రాహ్మణ సుహాసినీ అర్చన, అమ్మవారికి చతుషష్ట్యుపచార పూజ, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అవాహిత దేవతా హవనములు, శ్రీలక్ష్మీ గణపతి, శ్రీరుద్రశ్రీ చండీ హవనములు, అష్టోత్తర సహస్ర (1008) బ్రాహ్మణ సువాసినీ పూజ, మధ్యాహ్నం బ్రహ్మశ్రీ రుక్మాభట్ల సీతారామ శర్మతో నీరాజన సేవ, పుల్లూరు ప్రభాకర్ గుప్తాతో అక్షర గణితావధానం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చండీ హవనము, స్థాపిత దేవతా హవనములు, ప్రదోష పూజ, రాజోపచారములు, మంగళహారతులు, మంత్ర పుష్పము కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తీర్థప్రసాద వినియోగాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యాగంలో పాల్గొని, దర్శించుకున్నారు.