జిల్లా కేంద్రం మెదక్‌లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెదక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో మెదక్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో పురోగతి కరువైంది. ఎకడ వేసిన గొంగళి అకడే అన్నచందంగా పరిస్థితి ఉంది. కొత్త పనుల సంగతి ఏమో కానీ.. పాత పనులకు మోక్షం కలగడం లేదు. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్, జూన్ 5(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధికి విశేషంగా కృషిచేసింది. బీఆర్ఎస్ హయాంలో మెదక్ పట్టణంలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, రోడ్లు, కూడళ్ల సుందరీకరణ తదితర పనులు చేపట్టింది. మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సమీకృత మారెట్ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమీకృత మారెట్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయించారు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ సమీకృత మారెట్‌కు రూ.11.10 కోట్లు మంజూరయ్యాయి. కానీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పిల్లర్ల స్థాయిలోనే పనులు ఆగిపోయాయి. మెదక్ పట్టణంలో సమీకృత మారెట్ కలగానే మిగిలిపోయిందని ప్రజలు వాపోతున్నారు. రామాయంపేట్ పట్టణంలోనూ నిధుల లేమితో సమీకృత మార్కెట్ పనులు నిలిచిపోయాయి.
దాయర రోడ్డుకు మోక్షం లభించేనా…
మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి దాయరా రోడ్డు నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైనా అనివార్య కారణాలతో మురుగు కాలువలు పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపివేశారు. మెదక్ పట్టణానికి సర్దన, జకన్నపేట్, ఫరీద్పూర్, కూచన్‌పల్లి, ముత్తాయి కోట గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఈ రోడ్డు గుండా వస్తుంటారు. దాయర రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రజల ఇబ్బందులు తప్పనున్నాయి. మెదక్ పట్టణ శివారులోని డంప్‌యార్డు వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు నిలిచిపోయాయి.
సుందరీకరణకు నోచుకోని మినీ ట్యాంక్‌బండ్
పట్టణంలోని పిట్లం, గోసముద్రం చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించి 2016లో శంకుస్థాపన చేసింది. ఆ పనులు అసంపూర్తిగానే ఆగిపోవడంతో పట్టణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ హయాంలో పర్యాటక శాఖ నుంచి రూ.9.52 కోట్ల నిధులు మంజూరయ్యా యి. పట్టణవాసులకు ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
గతేడాది సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించారు. చెరువుకు ఇరువైపులా రేలింగ్ కొంతవరకు పూర్తయ్యింది. పర్యాటకుల కోసం గజోభాను, వివిధ ఆకృతులలో కుర్చీలను ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి చెరువు వద్దకు వచ్చే దారిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. కానీ, చెరువు సుందరీకరణకు మాత్రం నోచుకోవడం లేదు. చిన్నారులకు ఆట పరికరాలతో పాటు నడక మార్గం, పర్యాటకులు కూర్చునేలా అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కాంట్రాక్టర్ పనులు అసంపూర్తిగా వదిలివేయడంతో సాయంత్రం సమయంలో మందు బాబులకు అడ్డాగా మారింది. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో భాగంగా జరిగిన పనుల్లోనూ నాణ్యత కొరవడిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
సీడీఎఫ్ పథకం ఉన్నట్లా.. లేనట్లా…?
అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏటా ‘నియోజకవర్గ అభివృద్ధి నిధి పథకం (సీడీఎస్) కింద రూ.5 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సీడీఎఫ్ నిధులు కేటాయించకపోవడంతో ఆ పథకం ఉన్నట్లా, లేనట్లా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి 50 లక్షలు ఉన్న సీడీపీఎఫ్ నిధిని రూ.3 కోట్లకు పెంచింది. 2018 నుంచి రూ.5 కోట్లకు నిధులు పెంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి పథకం ద్వారా రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో తాగునీటి అవసరాల కోసం రూ. కోటి, పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతుల కోసం రూ.50 లక్షలు , మిగతా రూ.6.50 కోట్లను ఇతరత్రా అభివృద్ధి పనులకు వెచ్చించాలని నిర్ణయించింది. ఈ పనులు అన్నింటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం ఉండాలని ్రభ్రుత్వం పేరొన్నది.
ఎస్డీఎఫ్ కింద నియోజకవర్గాలకు నిధులకు కేటాయించిన ప్రభుత్వం సీడీఎఫ్ కింద నిధులు కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు అనేక హామీలు గుప్పించారు. గ్రామాల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, తాగునీటి పనులు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుద్దీకరణ పనులు, తదితర పనులకు సీడీఎఫ్ నిధులు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. సీడీఎఫ్ నిధులు ఎమ్మెల్యేలకు ధైర్యానిస్తాయి.
కానీ, ఆ నిధుల కేటాయింపు లేకపోవడంతో పట్టణాలు, గ్రామా ల్లో చిన్నచిన్న పనులకు మోక్షం లభించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఎస్డీఎఫ్ కింద కేటాయిస్తే, ఈ నిధులు సీడీఎఫ్ నిధులకు అదనమని మురిసి పోయారు. కానీ, కేటాయింపులు లేకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి నిధులు ఇస్తారా, లేదా అనే విషయం తేలడం లేదు. ప్రస్తుతం ఒకో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 కోట్ల నిధులు ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ నిధులు వస్తే మెదక్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సీడీఎఫ్ కింద ఈ ఏడాది నిధులను కేటాయిస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.