పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 2: సంగారెడ్డి జిల్లాలోని అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో సోమవారం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా అన్నింటిలోనూ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ అధిపతి, మాజీ సీఎం కేసీఆర్ పట్టణాల్లో చేసిన అభివృద్ధిని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. కాం గ్రెస్ పాలనలో పట్టణాలన్నీ మురుగు కూపాలుగా మారాయన్నారు. గతుకుల రోడ్లు, రోడ్లపై చెత్త, చీకట్లో మగ్గుతున్న బస్తీలతో పట్టణాలు కళాహీనంగా మారాయన్నారు. ఇష్టారీతిన బల్దియాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నదని గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. జిల్లాలోని అన్ని బల్దియాల్లో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి రైతు బంధు, పట్టణ అభివృద్ధి, పింఛన్లను గుర్తుచేయాలన్నారు.
సారు-కారు అంటూ ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 9 వరకు ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకోసం కష్టపడి పనిచేయాలన్నారు. బీఆర్ఎస్కు రెబల్స్ బెడద లేదన్నారు. ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నా వారు పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం దశదిశ అనే కార్యక్రమం రూపొందించామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి గడపకు వెళ్లబోతున్నదని, నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయనున్నారన్నారు. కేసీఆర్ సార్ ఆశీస్సులు, పార్టీ నేతల ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కోఆర్డినేటర్‌గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంకోసం పనిచేస్తానన్నారు. తనకున్న రిపోర్టుల ప్రకారం ప్రతి చోట బీఆర్ఎస్కు విశేష ఆదరణ కనబడుతున్నదన్నారు. అధికారపార్టీ కాంగ్రెస్ ఎన్నికుట్రలు చేసినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని నిలువరించలేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.
ఇస్నాపూర్‌లో మెజార్టీ ఖాయం
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని పట్లోళ్ల శశిధర్‌రెడ్డి అన్నారు. 26 స్థానాల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు మున్సిపాలిటీలో కనిపించకపోవడం ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నదన్నారు. సిగాచి కంపెనీ పేలుడులో రూ. కోటి నష్టపరిహారం ఇప్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ, హరీశ్‌రావు చేస్తున్న పోరాటాలతోనే రైతు భరోసా ఈ ప్రాంతంలో పడిందని గుర్తు చేశారు. గడీల శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానమే ఆపార్టీని ప్రజలకు దూరం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు మెరాజ్‌ఖాన్, దుర్గయ్య, ధనరాజ్, రాము, లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్‌రెడ్డి, దుర్గసాయి పాల్గొన్నారు.