అందోల్, అక్టోబర్ 2: సీఎం కేసీఆర్ సారధ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్‌లోని క్యాంప్ కార్యాలయంలో చౌటకూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఇదంతా తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పక్క రాష్ర్టాలు సైతం మెచ్చుకుంటున్నాయన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నది కాబట్టే అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారన్నారు. మున్ముందు పార్టీలో ఇంకా పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని, అందరూ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ చౌటకూర్ మండల అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.
సొంత గూటికి చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
చౌటకూర్, అక్టోబరు 2: చౌటకూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు సోమవారం సొంత గూటికి చేరారు. గ్రామానికి చెందిన తలారి సుభాష్, బేగరి విజయ్, బేగరి సాయిలుతోపాటు మరికొంత మంది రెండు రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ నాయకుల తీరు, పార్టీ విధానాలు నచ్చక మళ్లీ బీఆర్ఎస్లో చేరారు. వీరంతా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నివాసానికి ఆదివారం వెళ్లి బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారితో నాయకులు ఎండీ జాఫర్, ఆనందం, బేగరి వినోద్‌కుమార్, ఖాజీం తదితరులు ఉన్నారు.