మెదక్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే డాటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. సర్వే దశలో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే ఫోన్లో వివరాలు సేకరించాలని ఆదేశించారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, సీపీవో బద్రినాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 24: ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ఎంతో కీలకమైనదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సర్వే చివరి దశకు చేరుకున్నదని పేర్కొన్నారు. డాటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమైనదని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టిందన్నారు. సర్వేలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయని, వారికి ఫోన్లో వివరాలు సేకరించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో సర్వే పనులు వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. వలస కుటుంబాలు, డోర్ లాక్ కుటుంబాలను గ్రామాలకు పిలిపించి సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు. వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఇతర జిల్లా ఉన్నతాధికారులు మండలాల్లో పర్యటించినప్పుడు వసతి గృహాలు, సంక్షేమ గురుకులాల్లో తనిఖీ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో సర్వే పనులు వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ మనుచౌదరి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. వలస కుటుంబాలు, డోర్ లాక్ కుటుంబాలను గ్రామాలకు పిలిపించి సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు.