పాపన్నపేట, మే 21 : విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలన్న తలంపుతోనే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఆయన బుధవారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 1600 మంది ఎస్జీటీలకు 1800 మంది స్కూల్ అసిస్టెంట్లకు, ప్రధాన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ నిర్వహిస్తుండగా స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు శిక్షణకు సమయానికి హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.