జగదేవపూర్, ఆగస్టు 24: డెంగీ మరణాలు ప్రభుత్వ హత్యలేనని, సర్కారు వైఫల్యం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడకేసిందని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో డెంగీతో మృతి చెందిన కొంతం మహేశ్(34), నాయిని శ్రావణ్‌కుమార్(15) కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామంలో సుమా రు 60 కుటుంబాలు డెంగీబారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందక అనేక మంది ప్రైవేట్ దవాఖానల్లో డబ్బులు ఖర్చుచేసి వైద్యం చేయించుకునే దుస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి చేపట్టి ఊరూరా ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చి ప్రతి నెలా పంచాయతీల నిర్వహణకు రూ. 300 కోట్ల ఇచ్చామన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీల నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ట్రాక్టర్లు తిప్పే పరిస్థితి లేదని, గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదన్నారు. పల్లెల్లో చెత్త సేకరణ లేక ఊర్లకు ఊర్లు మం చాన పడుతున్నాయని విమర్శించారు. పల్లెల్లోని ప్రజలు, హాస్టళ్లల్లోని విద్యార్థులు దవాఖానల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకున్నామన్నారు.
కానీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై కుట్రలు, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడం తప్పా ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. దవాఖానల్లో రోగులకు మందులు లేవు కానీ మండలానికో వైన్ షాపు పెడుతామనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు యూరియా కోసం రోడ్లపైకి వచ్చి ధర్నా, రాస్తారోకో చేసే పరిస్థితులు వచ్చాయన్నారు. చెప్పులు క్యూలో పెట్టి ఒక యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్లు సంతోష పడుతున్నారన్నారు. గతంలో గులాబీ అధినేత కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికే 26 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ పెట్టాడని, ఇప్పుడు కనీసం 3వేల మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాలేదన్నారు. రేవంత్ పాలన రైతులకు కాలరాత్రులను మిగుల్చుతున్నదన్నారు.
డెంగీతో మృతి చెందిన శ్రావణ్, మహేశ్ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వ వైఫల్యం వల్లనే చనిపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విషజ్వరాల నుంచి ప్రజలను కాపాడాలన్నారు. తిమ్మాపూర్ గ్రామంలోని మృతుల కుటుంబాల దవాఖాన ఖర్చులను పూర్తిగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవీరవీందర్, ఏఎంసీ గజ్వేల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు మాదాసుశ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కొండపోచమ్మ, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు యాదవరెడ్డి, చంద్రశేఖర్, భూమయ్య, కిరణ్‌గౌడ్, కొత్తకవితాశ్రీనివాస్రెడ్డి, బుద్దనాగరాజు, కనకయ్య, సుమన్, శ్రీశైలం, బాలకిషన్ పాల్గొన్నారు.