సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 17 : ‘మా గాలి, భూమి మాకు ముద్దు – ఈ కంపెనీ మాకొద్దు’ అంటూ హత్నూ ర మండలంలోని వివిధ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హత్నూర మండలంలోని ఎల్లమ్మగూడ, ముచ్చర్ల, సాధుల్నగర్, వడ్డేపల్లి, కొనంపేట, తుర్కలఖానాపూర్ గ్రామాలకు చెందిన ప్రజ లు ధర్నాలో పాల్గొన్నారు. ఆయా గ్రామస్తులు సురభి కెమికల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే కంపెనీ నిర్మాణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో కంపనీ పేరుతో చిచ్చు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కంపెనీ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా కాలంలో అనుమతులు తీసుకున్నారనే వాదనలను వారు కొట్టిపారేశారు. అధికారులు చీకటి ఒప్పందాలతో అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయా అనుమతులను పున:పరిశీలించి సురభి కెమికల్ కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.