నమస్తే నెట్వర్క్, మే 31: ‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడు పేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే వీవోఏల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, రూ.26 వేల కనీస వేతనం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా ఆ హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిన ఈ రోజుల్లో కనీస వేతనం ఇవ్వకుంటే తామెలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పచ్చిగడ్డి తిని బతకాలా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఇటీవల సమ్మెలోకి దిగిన వీవోఏలు.. కొన్ని రోజులుగా విధులను బహిష్కరిస్తూ ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు.
అశ్వారావుపేట, కరకగూడెం మండలాల్లో ఆకులు, పచ్చిగడ్డి తింటూ; కూసుమంచి, వేంసూరు మండలాల్లో ఒంటి కాలిపై నించుంటూ వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేశారు. తిరుమలాయపాలెంలో వీవోఏల దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. కాగా, ఆయా సమ్మె శిబిరాల్లో వీవోఏలు మాట్లాడుతూ.. రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వీవోఏలకు సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలని, సాధారణ, ఆరోగ్య భద్రత బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దమ్మపేటలో సమ్మె చేస్తున్న వీవోఏలకు స్థానిక గాయత్రి ఆసుపత్రి బాధ్యులు సంఘీభావం తెలిపి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు.