సిద్దిపేట, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం… నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుకువచ్చి ప్రత్యర్థులకు ఉద్యమ రుచి చూపిన దినం 2009 నవంబర్ 29. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి శంఖారావం పూరించిన రోజు.. తెలంగాణ ఉద్యమ రథసారథి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.. నవంబర్ 29తో దీక్షా దివస్‌కు పదిహేనేండ్లు పూర్తవుతున్నాయి.
దీక్షా దివస్‌ను పురస్కరించుకొని బీఆర్ఎస్ పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి ఆదిశగా రెండు రోజులుగా జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్షా దీవస్ చేపట్టనున్నారు. ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలను నియమించగా వారి నేతృత్వంలో కార్యక్రమాలు జరగనున్నాయి.
సిద్దిపేటలో జరిగే దీక్షా దీవస్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పాల్గొంటారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు. సిద్దిపేటలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా తొలుత ప్రశాంత్‌నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకొని దీక్ష చేపడుతారు. పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దాదాపు 14ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాటి ఉద్యమ రథసారథి, గులాబీ అధినేత కేసీఆర్. ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా, శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనాన్ని కదిలించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్. ఆనాటి ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు.. ఇప్పటికీ జనాల హృద యాల్లో పదిలంగా ఉన్నాయి. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు చేపట్టిన సకల జనుల సమ్మెతో పాలన స్తంభించింది.
ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట దీక్షా స్థలానికి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 14ఎఫ్ రగడ.. తెలంగాణ ఉద్యమ దశను దిశగా మార్చి ఉద్యమానికి నాంది పలికి ఒక ప్రభంజనంలా సృష్టించింది ఖచ్చితంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష. హైదరాబాద్ నగరాన్ని ఆరో జోన్ నుంచి వేరు చేస్తూ ఫ్రీజోన్‌గా మార్చేందుకు తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న 14ఎఫ్ రగడ సంచలన నిర్ణయానికి నాంది పలికింది.
ఆరవై ఏండ్లుగా తెలంగాణ ప్రజలు అణిచివేతకు గురవుతున్న పరంపరలో ఫ్రీజోన్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి తెలంగాణ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చింది. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఫ్రీజోన్.. కాదురా.. హైదరాబాద్ మాదిరా.. పేరిట 14ఎఫ్‌కు వ్యతిరేకంగానిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగ సభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి వేదికైంది. ఈ సభలో కేసీఆర్ తెలంగాణ కోసం 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయిన సిద్దిపేటలో తాను దీక్ష చేపడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ సారథి కేసీఆర్ ప్రకటనలతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెను సంచలనాలు సృష్టించాయి.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పెను మార్పులు ఎన్నో కీలక ఘట్టాలను ఆవిష్కరించాయి. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ సాధించే వరకూ అదే స్ఫూర్తితో వేలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు సైతం పాల్పడి తెగించి కొట్లాడి తెలంగాణ వాదాన్ని బలపరుస్తూ అదే పంథాను కొనసాగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, అమరులు నిరంతరం తమ వాణిని వినిపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముక్తకంఠంతో ఆంధ్రోళ్లతో కొట్లాడితే ఆమరణ దీక్ష అనంతరం ఐదేండ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం యూపీఏ పరిణామాలు, ఉత్కంఠల నడుమ వాయిదాలపై ఊరిస్తూ అఖిలపక్ష తీర్మానాలు చేయించి లోక్‌సభలో ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఫిబ్రవరి 20న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోద ముద్రవేశారు. ఈ మేరకు మార్చి 1న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేశారు. తదనంతరం తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అదేరోజు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారు.
ఉద్యమ సారథి కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధిపేటను వేదికగా ఎంచుకున్నారు. సిద్దిపేట చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉద్యమ స్ఫూర్తిని చాటింది. ఇదే క్రమంలో కేసీఆర్ దీక్షను సవాల్‌గా తీసుకున్న హరీశ్‌రావు పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగధాంపల్లి అమరవీరుల స్తూపం సమీపంలో దీక్షా శిబిర వేదిక ఏర్పాట్లను ముమ్మరం చేశారు. వేలాదిగా తరలివచ్చే ఉద్యమకారులు కూర్చునేందుకు వీలుగా విశాలమైన ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
ఓవైపు తెలంగాణ వాదులు దీక్షా ఏర్పాట్లలో నిమగ్నమైతే.. మరోవైపు సిద్దిపేటలో అడుగడుగునా ఆంక్షలు, తనిఖీలతో వేలాదిగా పోలీసు బలగాలు మోహరించి ఖాకీ వనాన్ని తలపించాయి. పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు, వందల సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, వేలాదిగా సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు సిద్దిపేట నలువైపులా మోహరించాయి. మెదక్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట మీదుగా రంగధాంపల్లి దీక్షా శిబిరం వైపు వచ్చేందుకు దారులన్నీ నిషేధించి.. ముళ్లకంచెలతో మూసివేశారు. పోలీస్ అధికారుల వ్యూహాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ హరీశ్‌రావు పకడ్బందీ ప్రణాళికతో సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లారు.
దీక్షా వేదిక రక్షణ పార్టీ నాయకులు, ముఖ్యంగా హరీశ్‌రావుకు సవాల్‌గా మారింది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి చేరుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో.. క్షణానికో.. పుకార్లు.., నిమిషానికో ఎత్తుగడలతో పోలీస్ అధికారులు ప్రజల్లో.., ఉద్యమకారుల్లో ఒక రకమైన భయాందోళనలు సృష్టించారు. రంగధాంపల్లి దీక్షా వేదికను భగ్నం చేసేందుకు కీలకమైన బాధ్యత మాత్రం ఐపీఎస్ అధికారి లడ్డాకు అప్పగించడంతో తెలంగాణవాదులు, ఉద్యమకారుల్లో మరింత ఆందోళనకరంగా మారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.