జహీరాబాద్, అక్టోబర్ 24: పాత పంటల పరిరక్షణతోపాటు మహిళా సంఘాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)పై కొందరూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు హితవు పలికా రు.
గురువారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో సం స్థలో పనిచేసి బయటకు వెళ్లిన కొందరు మరికొన్ని సంస్థలతో కలిసి డీడీఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి డీడీఎస్కు విరాళాలు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. డీడీఎస్తో సంబంధం లేని కొం దరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీడీఎస్ సెక్రటరీగా పనిచేసిన పీవీ సతీశ్ 2023 వరకు సం స్థలో ఉన్నారన్నారు.
ఆయన మరణానంతరం తప్పుడు ఆరోపణలతో డీడీఎస్ను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 30 ఏండ్లుగా డీడీఎస్ నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, లావాదేవీల గురించి ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో డీడీఎస్ మహిళ సంఘాల సభ్యులు అనుసూయమ్మ, నాగమ్మ, లక్ష్మమ్మ, సూర్యకళ, స్వరూపమ్మ, మొగులమ్మ, చంద్రమ్మ, సురేమ్మ, నర్సమ్మ, డీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.