పటాన్చెరు, జూలై 6 : పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఎముకలతో డీఎన్ఏ పరీక్షలు చేయగా, చికెన్సింగ్ కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయ్యింది.
పటాన్చెరు ఏరియా దవాఖాలో ఉన్న గుర్తుతెలియని రెండు మృతదేహాల్లో ఒకటి రామాంజనేయుల మృతదేహంగా అధికారులు గుర్తించారు. మరో మృతదేహం అఖిల్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో మృతదేహాల అవశేషల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. అధికారులు సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన వారి కోసం 70 వరకు శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించారు. పటాన్చెరు దవాఖానలో వైద్యులు డీఎన్ఏ పరీక్షల కోసం కార్మికుల కుటుంబసభ్యుల నుంచి నమూనాలు సేకరించారు.
పటాన్చెరు ధ్రువ దవాఖానతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ దవాఖానల్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురి డీఎన్ఏ పరీక్షలు మ్యాచ్ అయ్యాయి. వీరిలో దాసరి రామాంజనేయులు (ఇస్నాపూర్), అఖిల్ (మహబూబాబాద్), చికెన్ సింగ్( మధ్యప్రదేశ్)గా గుర్తించారు.
సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో ఆచూకీ లేకుండా పోయిన మృతదేహాలు ఎక్కడ ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు సర్కార్ దవాఖాన పోస్టుమార్టం గది ముందర తమవారి కోసం వేచిచూస్తున్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటనా స్థలం వద్ద కార్మికుల మృతదేహాల కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదం జరిగి 7 రోజులు కావస్తుంది. ఘటనా స్థలంలో కార్మికుల మృతదేహాలు కాలిపోవడంతో వారి ఎముకలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పటాన్చెరు దవాఖానలోని పోస్టుమార్టం గదిని ఆదివారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల మృతుల గుర్తింపు ప్రక్రియ కోసం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు, అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. పక్కాగా డీఎన్ఏ పరీక్షలు చేసి, అంబులెన్స్, పోలీసు ఎస్కార్ట్ తో పాటు మానవ అవశేషాలు అప్పగింత సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాలను కలెక్టర్ ఓదార్చారు.
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సిగాచి ఫ్యాక్టరీలో శిథిలాల తొలిగింపులో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. సిగాచి పరిశ్రమల్లో ఆదివారం వరకు 42 మంది మృతిచెందినట్లు తెలిపారు. గల్లంతైన 8 మంది కార్మికుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నామని, ప్రమాదంలో గాయపడిన 18 మంది కార్మికులకు దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.