సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 15: సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం సంగారెడ్డిలోని పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పారితోష్ పంకజ్‌తో కలిసి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 225 కోట్ల విలువైన రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి, కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.