న్యూఢిల్లీ, అక్టోబర్ 1: భారతదేశపు అత్యున్నత సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గురువారం నాటికి ఒక శతాబ్దాన్ని పూర్తి చేసుకున్నది. 1926 అక్టోబర్ 1న యూపీఎస్సీ దేశంలో ఏర్పడింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 315-326 కింద యూపీఎస్సీకి రాజ్యాంగపరమైన స్వతంత్ర హోదా లభించింది. 1950-51లో సివిల్ సర్వీసుల కోసం 42,727 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఆ సంఖ్య 2022-23 నాటికి 45,10, 044కు పెరగడం యూపీఎస్సీకి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తున్నది. 2022-23లో యూపీఎస్సీ 15 పరీక్షలు నిర్వహించగా వాటికి 33,51,916 దరఖాస్తులు అందాయి. అలాగే ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకాల కింద 4,411 పోస్టుల కోసం 233 రిక్విజిషన్లను స్వీకరించింది. ఇది యూపీఎస్సీ పరిధి ఎంతగా విస్తరించినదో నిరూపిస్తుంది.
ఎంపికల్లో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. విభిన్నత్వం కోసం యూపీఎస్సీ చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1952లో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగా 2025 నాటికి మహిళల ప్రాతినిధ్యం మొత్తం ఎంపికల్లో దాదాపు మూడింట ఒక వంతుకు పెరిగింది. ఇందులో భాగంగా అత్యున్నత ర్యాంకులలో దాదాపు సగం స్థానాలను మహిళలే కైవసం చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల సంఖ్య కూడా భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇందులో పాల్గొనడం సులభమైంది. వంద సంవత్సరాలుగా ప్రతిభను గుర్తించడం, నిష్పాక్షికతను కాపాడటం, అలాగే హోదా, భౌగోళిక ప్రాంతం, భాష లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు అందేలా చూడటం వంటి దేశంలోని అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఒకదానిని ఈ కమిషన్ నిర్వహిస్తూ వస్తున్నది అని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.