బంజారాహిల్స్,అక్టోబర్ 1:రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స కోసం ప్రభుత్వం తరపున రూ.200కోట్ల వ్యయంతో నాలుగు వైపులా రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కమిషన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉఛ్వాస్ రిహాబిలిటేషన్ సెంటర్లో ‘జస్ట్ ఆంకో’ క్యాన్సర్ డే కేర్ సెంటర్‌ను గురువారం గౌరవ్ ఉప్పల్ ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో రూ.200కోట్ల వ్యయంతో క్యాన్సర్ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఎమ్ఎన్జే క్యాన్సర్ సెంటర్ ఎపెక్స్ సెంటర్‌గా వ్యవహరించనుందన్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ సోకిన మహిళల్లో ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే 90శాతం మంది సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉఛ్వాస్ చైర్మన్ డా. అంబటి రాంపాపారావు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్ డా. ముక్త శ్రీనివాసులు, డా. విజయలక్ష్మి బాలకృష్ణణ్ తదితరులు పాల్గొన్నారు.