జహీరాబాద్, మే 14 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని నిమ్జ్ ప్రాజెక్టులో వేమ్ టెక్నాలజీ పరిశ్రమనకు శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయనున్నారు. నిమ్జ్ కోసం 2012లో 17 గ్రామాల్లో 12,635 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 7,588 ఎకరాల భూసేకరణ పూర్తియింది. మొదటి విడతలో సేకరించిన నిమ్జ్‌లో 2,345 ఎకరాల్లో పారిశ్రామిక స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు చేపట్టింది. దీనికోసం ఈనెల 10న హైదరాబాద్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చునల్గా శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో అధికారులు కడీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో వెమ్ టెక్నాలజీ పరిశ్రమ స్థాపనకు 511 ఎకరాల భూమి కేటాయించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు యాజమాన్యం రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా 2వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అప్పట్లో మంత్రి కేటీఆర్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇదే పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబు నేడు మళ్లీ శంకుస్థాపన చేయనున్నారు.
దీనికోసం అధికారులు, యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమ భూములకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారు. కూలీలకు పునరువాసంతో పాటు భూములు కోల్పోయిన బాధిత రైతులకు 125 గజాల ఇంటి స్థలం, ఇండ్లు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలను కల్పించాలని రైతులు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు నిమ్జ్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన 5,612 మంది రైతులకు ఇంటి స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ, నేటి ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రులను బాధిత రైతులు కోరుతున్నారు.