అందోల్, సెప్టెంబర్ 12: విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని..అలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు సంగుపేట లక్ష్మీదేవిగార్డెన్లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యతోనే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చేర్పించి వారు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు.
చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి అందోల్ నియోజవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడంకోసం కృషిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు అందోల్ నియోజకవర్గంలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. జేఎన్టీయూ పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు ఇలా ఎన్నో విద్యా సంస్థలు ఏర్పా టు చేశామని, వాటి ద్వారా ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారన్నారు.
కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆర్డీవో పాండు, డిప్యూటీ తహసీ ల్దార్ సాగర్మధుకర్రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాణ య్య, మండలాధ్యక్షుడు నరోత్తం, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్పటేల్, ఎంఈవో కృష్ణ, నాయకులు చిట్టిబాబు, రమేశ్‌గౌడ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.