రామచంద్రాపురం, నవంబర్ 3: విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో సోమవారం కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా రూ.4కోట్లతో చేపట్టనున్న స్కూల్, మున్సిపల్ జనరల్ నిధులు రూ.3కోట్లతో పార్కు, రూ.50లక్షలతో గ్రేవ్‌యార్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్‌తో కలిసి వారు శంకుస్థాపన చేశారు. అంతకుముందు 2బీహెచ్‌కే సముదాయంలో నిర్మాణ దశలో ఉన్న యూపీహెచ్సీ పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ముందుగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో ఇప్పటికే కొన్ని పరిష్కరించినట్లు తెలిపారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని ఆమె చెప్పారు.
అనంతరం పలువురు లబ్ధిదారులతో మాట్లాడించారు. కొల్లూర్ 2బీహెచ్‌కేలో చాలా సమస్యలు ఉండేవని, తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. రేషన్ బియ్యం కొల్లూర్‌లో ఇవ్వడం లేదని, 2బీహెచ్కేలోనే రేషన్ బియ్యం ఇచ్చేలా చూడాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఉదయం సమయంలో ఎక్కువ తిరిగేలా చూడాలని, బస్సు డ్రైవర్, కండక్టర్ తమకు విలువ ఇవ్వడం లేదని, బస్సులు ఎక్కుతుంటే తిడుతున్నారని ఓ మహిళ మంత్రుల దృష్టికి తీసుకువచ్చింది. పోలీస్ స్టేషన్, ప్రహరీ, అంబులెన్స్‌లు, దవాఖాన, గ్రేవ్‌యార్డు, స్కూల్, పార్కు, గ్రౌండ్, సీసీ కెమెరాలు, ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేయించాలని లబ్ధిదారులు మంత్రులను కోరారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 2బీహెచ్‌కే సముదాయంలో వీఎస్టీ పరిశ్రమ వారు రూ.4కోట్ల సీఎస్ఆర్ నిధులతో 60 గదుల స్కూల్ భవన నిర్మాణానికి ముందుకురావడం అభినందనీయమన్నారు.
కొల్లూర్ 2బీహెచ్‌కేలోని లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ విద్య, వైద్యం, సాధికారత, సామాజిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వ విధానమన్నారు. కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయం మినీ హైదరాబాద్ అని, ప్రత్యేక సమాజం ఇక్కడ నివాసం ఉంటుందని తెలిపారు. సంక్రాంతిలోపు యూపీహెచ్‌సీని ప్రారంభించి వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. త్వరలోనే రెండు అంబులెన్స్‌లు మంజూరు చేస్తామన్నారు. రాష్ర్టానికే ఆదర్శంగా 2బీహెచ్కేని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం వీఎస్టీ పరిశ్రమ యజమానులను మం త్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రాజేందర్, డీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ గణేశ్పటేల్, అధికారులు పాల్గొన్నారు.