పటాన్చెరు రూరల్, జూలై 20: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి విజేత కాలనీలో రోడ్లు ధ్వంసమై వాహనాల రాకపోకలకు కష్టతరమవుతున్నది. నడిచేందుకు కూడా గుంతల్లోని మురుగు అడ్డంకిగా మారింది. సర్కస్ ఫీట్లు చేస్తేనే ఇండ్ల్లకు చేరే పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలోని విజేత కాలనీకి జాతీయ రహదారి నుంచి మెటల్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు పూర్తిస్థాయిలో ధ్వంసమై కంకర తేలింది. భారీ గుంతలు ఏర్పడి మురుగు నిలిచిపోయింది.
ఈ గుంతల్లోంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు ప్రయాణించడం ఇబ్బందికరంగా మారింది. బస్సులు, లారీలు రాలేని విధంగా రోడ్డు అధ్వానంగా తయారైంది. విజేత కాలనీతో పాటు సనా వెంచర్ సెంకడ్ ఫేస్, ఆదర్శ్‌కాలనీ, ఇతర కాలనీలకు ఈ రోడ్డే ఆధారం. ఈ రోడ్డు అధ్వానంగా మారిందని పలు స్కూల్ బస్సులు రావడం బంద్ అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను జాతీయ రహదారి వరకు తీసుకువచ్చి స్కూల్ బస్సుల్లో ఎక్కిస్తున్నారు.
ఉదయం సమయంలో ఎలాగోలా బస్సుల్లో ఎక్కించినా, సాయంత్రం ఏ బస్సు ఏ టైమ్‌కు జాతీయ రహదారి స్టాప్‌కు వస్తుందో తెలియదు. విద్యార్థులు తెలిసీ తెలియక జాతీయ రహదారి పక్కన్న నిల్చున్నా, ఆడుకున్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వేలాది మంది నివసించే విజేత కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది.
2023 ఎన్నికలను పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు విజేత కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డుకు సీసీగా మారుస్తామని శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి నుంచి విజేత కాలనీకి, సనా వెంచర్, ఆదర్శ్ కాలనీలను కలుపుతూ ఈ రోడ్డును వేసేందుకు శంకుస్థాపనలు జరిగాయి. తర్వాత రోడ్డుపై పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్ కంకర పరిచాడు. అనంతరం ఈ పనులు ఎందుకో నిలిపివేశారు. ఒకవైపు గుంతలు, మరోవైపు రోడ్డుపై దొడ్డు కంకరతో ప్రజలు ప్రయాణించేందుకు జంకుతున్నారు.
ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో మురుగు నిలవగా నడిచేందుకు కష్టంగా మారింది. కాలనీకి ఆటో, కారు డ్రైవర్లు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా రోడ్డును పూర్తిచేసి ఇబ్బందులు తొలిగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. పలుమార్లు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.