సిద్దిపేట, నవంబర్ 16: సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొంతమంది నాయకులు ప్రయతిస్తున్నారని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు ఆరోపించారు. ఆ భూమి తమకే కేటాయించాలని శనివారం దళిత కుటుంబాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూర్వకాలం నుంచి ఈ స్థలంలో దళితుల శ్మశాన వాటిక ఉండేదని వారు తెలిపారు.
మూడు గుంటల భూమికి ప్రస్తుతం 280 గజాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ స్థలంలో మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. అంబేదర్ మాల సదర్ సంఘం పేరుతో బోర్డు ఏర్పాటుచేసి, దళిత నాయకులు నిర్మాణాలు చేపట్టారన్నారు. ప్రభుత్వం వెంటనే తమకు ఈ భూమిపై సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి స్థలం తమకు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.