సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/సంగా రెడ్డి/జహీరాబాద్: విజయడెయిరీని నమ్ముకుని పాలు పోసిన రైతులకు డబ్బులు అందక ఇక్కట్లు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 4892 మంది రైతులకు విజయడెయిరీ రూ.1.75 కోట్లపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా రైతులు తమకు రావాల్సిన బకాయి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా ప్రభుత్వం, విజయడెయిరీ రైతులకు బకాయిలు చెల్లించడంలేదు.
సంగారెడ్డి జిల్లాలోని 22 మం డలాల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు. నాలుగు నియోజకవర్గాల్లోని 22 మండలాల పరిధిలోని 152 గ్రామాల నుంచి పాడి రైతుల నుంచి విజయడెయిరీ పాలను సేకరిస్తుంది. 152 గ్రామాల నుంచి 101 పాలసేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి మొదట పాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన పాలను 23 రూట్ల ద్వారా మాచిరెడ్డిపల్లి, ,కోహీర్, సదాశివపేట, తడ్కల్, జోగిపేట, నారాయణఖేడ్‌లోని బల్క్ మిల్క్ సెంటర్లకు చేరుస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పాలను నారాయణఖేడ్, జహీరాబాద్‌లోని మిల్క్ చిల్లింగ్ కేంద్రాలకు తరలిస్తారు.
సంగారెడ్డి జిల్లాలో రోజూ 4892 మంది పాడి రైతుల నుంచి 10,500 లీటర్లను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసి పాలు, పాల ఉత్పత్తులను విజయడెయిరీ నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంది. జిల్లాలో పాలసేకరణ, విక్రయాలు సజావుగానే సాగుతున్నప్పటికీ రైతులకు చెల్లించాల్సిన డబ్బులను మాత్రం విజయడెయిరీ చెల్లించడం లేదు. పాడి రైతులకు కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో రైతులు విజయడెయిరీకి పాలు విక్రయించేదిలేదంటూ మొండికేసే పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ డెయిరీ కంపెనీలు విజయడెయిరీకి సంబంధించిన పాడి రైతులను తమవైపు తిప్పికుని పాలసేకరణను పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
సంగారెడ్డి జిల్లాలో విజయడెయిరీ రైతులకు రూ.1.75 కోట్లకుపైగానే డబ్బులు బకాయిపడింది. బకాయి డబ్బులు రాక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గడ్డి, దాణా తినిపించడంతోపాటు పాడిదిగుబడి తగ్గినప్పుడు, వ్యాధులు సోకినప్పుడు సరైన చికిత్సలు చేయించేందుకు డబ్బులు అవసరం అవుతాయి. పాలు కొనుగోలు చేసిన విజయడెయిరీ మూ డు మాసాలుగా డబ్బులు చెల్లించడం లేదు.
దీంతో రైతులు డబ్బుల కోసం ఇక్కట్లు పడాల్సి వస్తోంది. విజయడెయిరీ పాలలోని ఫ్యాట్ పర్సంటేజీని అనుసరించి డబ్బులు చెల్లిస్తుంది. లీటర్ పాలలో ఐదు శాతం ఫ్యాట్ పర్సంటేజీ ఉంటే రూ.40, లీటర్ పాలలో 6 నుంచి 10 శాతం ఫ్యాట్ ఉంటే రూ.80 చెల్లిస్తుంది. జిల్లాలోని 4892 మంది రైతుల నుంచి సేకరించిన పాలకు ప్రతి15రోజులకు ఒకసారి విజయడెయిరీ డబ్బులు చెల్లిస్తుంది. జూలై, ఆగస్టు,సెప్టెంబర్ మాసాలకు సంబంధించి పాడి రైతులకు విజయడెయిరీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. జూలై నెలకు సంబంధించి రూ.61 లక్షలు, ఆగస్టు నెలకు సంబంధించి రూ.64 లక్షలు, సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
మూడు మాసాలుగా జిల్లాలోని 4892 మంది రైతులకు రూ.1.75 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పాడి రైతులు విజయడెయిరీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేదంటే ఆందోళనకు దిగుతామని పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పాడి రైతులకు రూ.6 కోట్లకుపైగా ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇన్సెంటివ్ బకాయిలను సైతం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నది వాస్తవమే. పది, పదిహేను రోజుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నది. డబ్బులు రాగానే రైతుల వారీగా చెల్లింపులు చేస్తాం. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. నిత్యం విజయ పాల డెయిరీకి రైతులు పాలు పోస్తున్నారు. గ్రా మాల నుంచి పాలశీతలీకరణ కేంద్రాలకు పాలు తరలిస్తున్నారు. అక్కడి నుంచి విజయ డెయిరీకి ప్రత్యేక వాహనాల్లో జిల్లా నుంచి రోజూ 10వేల లీటర్లకు పైగా పాలు వస్తున్నాయి. విజయ డెయిరీ ఉత్పత్తులు రైతులకు అంతగా అవసరం ఉండదు. దాణా, గడ్డి విత్తనా లు, కాల్షియం మందుల వరకే అవసరం ఉంటాయి.
– గోపాల్ సింగ్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ సంగారెడ్డి జిల్లా
సిద్దిపేట, సెప్టెంబర్ 29 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీకి 3,000మంది రైతులు నిత్యం పాలు పోస్తున్నారు. మొత్తం పెండింగ్ ఉన్న బిల్లులు రూ. 8 కోట్ల 20 లక్షలు ఉన్నాయి. ప్రైవేట్ డెయిరీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండాసతాయిస్తున్నదని రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హెరిటేజ్ డెయిరీకి మేలు చేకూర్చేందుకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నా రు. ఈ విషయంపై విజయ డెయిరీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, రాష్ట్ర డెయిరీ సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ధర తగ్గించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 29 : గ్రామ సంఘం నుంచి రోజూ జహీరాబాద్ పాలశీతలీకరణ కేంద్రానికి 900 లీటర్ల పాలు వెళ్తాయి. ప్రభుత్వం గత జూలై 15 వరకు మాత్రమే పాల బిల్లులు చెల్లించింది. ఆ తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాకు రెండున్నర నెలలకు సంబంధించి రూ. 25 లక్షల పాల బిల్లులు రావాల్సి ఉంది. పశువులతో పాటు, కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పోసోప్పు చేసి బిల్లులను వెంటనే చెల్లిస్తున్నా. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వెంటనే బిల్లులు చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలి.
– బరూర్ మాణిక్‌రెడ్డి, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, మామిడ్గి గ్రామం, న్యాల్కల్ మండలం
మూడు నెలలుగా పాల బిల్లులు రావడం లేదు. నేను చాలా ఏండ్లుగా విజయ డెయిరీకే పాలు పోస్తున్నాను. ప్రతినెలా సుమారు రూ.30వేల వరకు పాల బిల్లులు వస్తాయి. మూడు నెలలుగా రూ.90వేల బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మాకు నెలనెలా బిల్లులు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఇట్ల చేస్తున్నదో అర్థమైతలేదు. గతంలో బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు బోనస్ లేదు… పాల బిల్లులు కూడా అందడం లేదు. దీంతో రైతులు డబ్బులకు ఇబ్బందులు పడుతున్నారు.
– సాయిరెడ్డి, పాడిరైతు, రామతీర్థం, మెదక్ జిల్లా
జహీరాబాద్, సెప్టెంబర్ 29: సకాలంలో విజయ డెయిరీకి పాలు పోసినా బిల్లులు రాక ఇబ్బందులు తప్పడం లేదు. రెండు నెలలకు సంబంధించిన పాల బిల్లులు రాలేదు. దీంతో ప్రైవేట్ వ్యాపారికి పాలుపోస్తున్నా. సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల పశువులు, కుటుంబ పోషణ భారంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారిని ఆశ్రయించాల్సిన వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా పెండింగ్ పాల బిల్లులు ఇప్పించాలి.
– గార్లపల్లి అశోక్, పాడి రైతు, హద్నూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా
విజయ పాల కేంద్రాల్లో పాలుపోసే రైతులకు రెండు నెలలుగా పాల బిల్లులు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేను రోజులకొక్కసారి రైతుల అకౌంట్లో పాల బిల్లులు పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాల బిల్లుల కోసం రైతులు పాలకేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం బిల్లులు వేయడం లేదు. పశువులకు దాణా, మేతపెట్టని దుస్థితి నెలకొంది. గతంలో లీటర్‌కు రూ.నాలుగు బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు బోనస్ మాట అటుంచితే పాల బిల్లులు కూడా అందడం లేదు. దీంతో గ్రామాల్లో పాల కేంద్రాలను నడపడం కష్టమవుతున్నది.
– చెవిటి మహేశ్, విజయ డెయిరీ చైర్మన్, గాగిళ్లాపూర్, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా