పటాన్చెరు రూరల్, డిసెంబర్ 22: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూపరింటెండెంట్ హర్షవర్ధన్ విద్యార్థులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌లు, చాటింగ్‌లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని, పాస్వర్డులు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసగాళ్లు ఉచితం అని, లాటరీ తగిలిందని, డిస్కౌంట్ ఆఫర్ల పేరిట ఏపీకే ఫైల్ లింకులు పంపించి మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏదీ ఉచితం ఉండదని ఆయన గుర్తు చేశారు. ఓటీపీ, పెట్టుబడి, పార్సిల్ మోసాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్టుల పేరిట నకిలీ పోలీసుల మోసాలను నమ్మవద్దని సూచించారు.
ఎలాంటి మోసాలు జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. సైబర్ నేరగాళ్లు తక్కువ చదివి విద్యావంతులను టార్గెట్ చేసి మోసాలు చేయడం జరుగుతున్నదని హెచ్చరించారు. అనంతరం పోస్టర్లు, స్టిక్కర్లు, క్లిప్పులు, జింగిల్స్‌తో విద్యార్థులకు అవగాహన కల్పించారు. నోడల్ అధికారి డీఎస్పీ కేవీ సూర్యప్రకాశ్, ప్రొఫెసర్ పి.త్రినాథరావు, సంగారెడ్డి అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, పటాన్చెరు ఎస్‌హెచ్‌వో వినాయక్‌రెడ్డి, టీసీఎస్బీ ఇన్స్పెక్టర్ రవి, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.