చిలిపిచెడ్, జూన్ 24: గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు చేస్తుండగా ఎప్పుడు కరెంట్ తీగలు తెగి మీద పడుతాయోనని ఆందోళన చెందుతున్నారు. కరెంట్ సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు కోరినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రమైన చిలిపిచెడ్, గౌతాపూర్, చిట్కుల్,అజ్జమర్రి, గిరిజన తండాలో ఇంటి పైనుంచి, రైతుల పొలంలో చెట్టు కొమ్మపై విద్యుత్ తీగలను ప్రాణ రక్షణగా ఏర్పాటు చేస్తుకున్నారు. కొంత మంది పొలాలలో భూమిని తాకేలా ప్రమాదకారంగా విద్యుతు తీగలు ఉన్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా విద్యుత్ అధికారులు వ్యవహిస్తున్నారు. అలాగే మండలంలోని రైతులు పొలంలో విద్యుత్ తీగలను సరి చేయాలని ఎన్ని సార్లు విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకపోయినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుటికైన స్పందించి వర్షాలు ప్రారంభం కాకముందే పొలాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.