జహీరాబాద్, మే 18: చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే ప్రాంతంగా జహీరాబాద్‌కు పేరు ఉంది. చిన్న,సన్న కారు రైతులు ఎంతోమంది తమకున్న ఎకరా, రెండెకరాల భూమిలో పాత పంటలు సాగు చేస్తున్నారు. వానకాలంలో అధికంగా పచ్చజొన్న, పెసరా, మినుము, అంతర పంటగా కంది, పిల్లిపెసర, ఉలవలు, కొర్రలు, సామలతో పాటు పలు పంటలు సాగు చేస్తారు. వేసవి మధ్యలో పదును వానలు కురువడంతో దుక్కులు జోరుగా సాగుతున్నాయి. సకాలంలో వానలు కురిస్తే వెంటనే విత్తనాలు విత్తేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.5వేలు రైతుబంధు డబ్బులు అకౌంట్లలో జమ చేస్తుంది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది. దీంతో వర్షాధార పంటల సాగు ప్రతి ఏటా పెరిగిపోతున్నది.
చిరుధాన్యాలే భవిష్యత్ ఆహారం
దేశంలో సాగు భూమి విస్తీర్ణం 141 మిలియన్ హెక్టార్లు ఉందని అంచనా. అందులో 85 మిలియన్ హెక్టార్లు వర్షంపై ఆధారపడిన సాగు భూమి ఉండడంతో రైతులు అధిక శాతం వర్షాధార పంటలైన జీవ వైవిధ్య పంటలను సాగు చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో చవుడు భూముల్లో జొన్న, వేరుశనగలను సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలతో అద్భుత పోషకాలతో పాటు పశువులకు ఆహారం లభిస్తుంది. చిన్న, సన్నకారు రైతులు తమకున్న ఎకరం భూమిలో పది రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులంతా వాణిజ్య పంటలపై మొగ్గు చూపుతున్నా జీవ వైవిధ్య పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జహీరాబాద్ రైతులు. ఈ పంటలకు సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. పశువుల పేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను వేసవిలో భూమిలో వేసి దుక్కులు దున్నుతున్నారు. రసాయన ఎరువులు వినియోగంతో ప్రకృతి సంపద, భూసారం తగ్గిపోయి పంటలకు నష్టం జరుగుతుందనే వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను అమలు చేస్తున్నారు.
వేసవి దుక్కులకు పెరిగిన డిమాండ్
వేసవి దుక్కుల కోసం రైతులు ట్రాక్టర్లు, ఎద్దులు ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో రైతుల వద్ద ఎద్దులు లేకపోవడంతో ట్రాక్టర్లకు బాగా డిమాండ్ పెరిగింది. దుక్కి చేసేందుకు గంటకు రూ. 1200 నుంచి 1500 వరకు రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఎకరానికి రూ. 700 నుంచి రూ. 850 వరకు వసూలు చేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో గంటకు రూ. 1700 నుంచి రూ. 1800 వరకు వసూలు చేస్తున్నారు. దుక్కి చేసేందుకు గత ఏడాది కంటే ఈ ఏడాది ధర పెరిగింది. ఒక గంటకు రెండెకరాల్లో దుక్కులు చేస్తారు. డీజిల్ ధర పెరిగిపోవడంతో ట్రాక్టర్ల యజమానులు ధరలు భారీగా పెంచారు. పలుచోట్ల ఎద్దులతో చెక్కల గుంటకను ఉపయోగిస్తున్నారు.
Farmers1
వేసవి దుక్కులతో ఎంతో మేలు
వేసవి దుక్కులతో భూమితో పాటు పంటలకు ఎంతో ఉపయోగం. ఎక్కువ శాతం మంది రైతులు పంటలు కోయగానే పొలా న్ని వదిలేస్తారు. తొలకరి వానలు పడిన సమయంలో వాన కాలం పంటలు వేసేందుకు భూములు సిద్ధం చేస్తారు. వేసవిలోనే దుక్కులు దున్నుకుంటే భూమి పొరల్లో దాగి ఉండే కీటకాలు, గుడ్లు, శిలీంద్రాలు బయటపడి నశిస్తాయి. దుక్కుల సమయంలో భూమి లోపల ఉండే పురుగులు నేలపై భాగానికి చేరుతాయి. వాటిని కాకులు, కొంగలు వంటి పక్షులు తింటాయి. లోతు దుక్కులు చేయడం ద్వారా పంట కోత తర్వాత మిగిలిన చెత్తాచెదారం భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి పంటలకు బలాన్నిస్తుంది. కలుపు మొక్కలు చనిపోతాయి. వేసవి దుక్కులతో గట్టిగా ఉండే భూమి గుల్లబారుతుంది. వానపడిన వెంటనే వర్షపు నీరు భూమిలోకి సులభంగా చేరి, అధికశాతం నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. భూమి దున్నడం ద్వారా పొరల్లోకి గాలి బాగా చేరుతుంది. సేంద్రి య కార్బనం బాగా పెరుగుతుంది. భూమిలో పోషకాలు మొక్కకు అధికంగా అందుతాయి.
భూమి సిద్ధం చేస్తున్నా
వానకాలంలో విత్తనాలు వేసేందుకు భూమిని సిద్ధం చేస్తు న్నా. భూమిలో కంది, పత్తి, చేసేందుకు దుక్కులు చేసి కొయ్యలు తీసేశాము. వాన పడిన వెంటనే మరోసారి దుక్కి దున్నిస్తాను. సేంద్రియ ఎరువు చల్లుకుంటున్నాను. దేవుడిపై భారం వేసి పంటలు సాగు చేస్తాం.
-రాజు పవార్, రైతు సజ్జారావుపేటతండా
వేసవి దుక్కులు చాలా ముఖ్యం
రైతులు వేసవి దుక్కులు చేసుకోవడం చాలా ముఖ్యం. భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తే కలుపుమొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. భూమిలో ఉండే నీటిని పోషక పదార్థాన్ని గ్రహిస్తాయి. దీంతో భూమి పొరల నుంచి నీరు ఆవిరైపోతుంది. దీంతో భూసారం తగ్గడంతో పాటు దిగుబడులు తగ్గిపోతాయి. 2 నుంచి 3 అడుగుల లోతు దుక్కి చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. ఈ ఏడాది రైతులు చిరుధాన్యాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-భిక్షపతి, ఏడీఏ జహీరాబాద్