బీడు బారిన భూములు.. రైతు ఆత్మహత్యలు.. ఉపాధి కోసం వలసలు.. ఎండిపోయిన చెరువులు.. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. సాగునీటి వనరులు పెంచి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెక్ నిర్మించారు. ఫలితంగా భూగర్భ జలాలు పైకొచ్చాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో అన్నదాతలు ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. దీంతో వానకాలం, యాసంగి సీజన్ రైతులతో పాటు కూలీలకు ఏడాదంతా పనిదొరుకుతున్నది. ఒకప్పుడు పొట్టచేతపట్టుకుని వలస వెళ్లిన వాళ్లు నేడు సొంతూరుకొచ్చి సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, లారీల వినియోగం అధికమైంది. వాహన యజమానులు రోజంతా కిరాయిలకు నడిపిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తేతెలంగాణ),సెప్టెంబర్ 24
బతుకుదెరువు వలస వెళ్లే రోజులు పోయాయి. ఎడ్ల బండ్లు కట్టుకొని కైకిలి కోసం వెతికే జిల్లాకు కైకిలి కోసం వలస వస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో సాగుకు పుష్కలంగా నీరు రావడంతో ఎవుసం కైగట్టింది. రైతన్నలు సిరుల పంటలు పండిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగి ఎవుసం పండుగ.., ఉపాధి మెండుగా మారింది. అన్నదాతలే కాదు వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందే వారు కూడా సంతోషంగా పనులు చేసుకుంటున్నారు.
మెదక్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఏడాది పొడువునా రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం వలసలు వెళ్లిన కుటుంబాలు, రైతులు ఇప్పుడు దర్జాగా ఉన్న ఊరిలోనే పనులు చేసుకుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో అంచనాలకు మించి పంటలు సాగవుతున్నాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, లారీల యజమానులు, కూలీలకు ఫుల్ పనులు దొరుకుతున్నాయి. యాసంగి, వానకాలంలో క్షణం తీరికలేకుండా ఉపాధి పొందుతున్నారు. ఉన్న ఊరిలోనే ఉంటూ సంతోషంగా జీవిస్తున్నారు. పలుచోట్ల కూలీలు దొరకకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని నియమించుకుని పనులు చేయించుకుంటున్నారు.
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్
మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్నిరకాల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నది. విద్యుత్ వినియోగం సైతం పెరిగిపోతున్నది. అయినా విద్యుత్ సరఫరాకు క్షణం అంతరాయం ఉండడం లేదు. మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరుగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ వ్యవసాయ అనుకూల విధానాలను అమలుచేయడంతో, తొమ్మిదేండ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిపోయింది. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించారు. 2014 సంవత్సరంలో అతి తక్కువ వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి.
పెరుగుతున్న నీటి వనరులు…
వానకాలంలో భారీ వర్షాలు కురవడంతో బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. వట్టిపోయిన బోర్లలో కూడా నీరు ఉబికి వస్తుండడంతో రైతులు మళ్లీ మోటర్లు బిగిస్తున్నారు. వానకాలం సీజన్ ఆరంభంలోనే తొలకరి జల్లులు కురవగా, మధ్యలో కొద్ది రోజులు వరుణుడు ముఖం చాటేసినా, తర్వాత ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండి పొంగిపొర్లాయి.
గిరాకీ బాగుంది..
నాకు ట్రాక్టర్ ఉంది. వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభంలో దుక్కులు దున్నడంతో పాటు వరి నాట్లు వేసే సమయంలో కేజీవీల్స్ పనులు జోరుగా ఉంటాయి. దుక్కులకు గంటకు రూ.700, కేజివీల్స్ గంటకు రూ.1400 తీసుకుంటా. ప్రతి సీజన్ 150 గంటలు కేజివీల్స్ పని చేస్తా. వరి నాట్లు అయిపోగానే ట్రాలీ వర్క్ చేస్తా. బెందడి, రాళ్లు, అప్పుడప్పుడు ఇసుక ఇలా అన్ని పనులకు ట్రాక్టర్ ఉపయోగిస్తా.
– పోతరాజు లింగం, ట్రాక్టర్ యజమాని, ఫరీద్ మెదక్ జిల్లా
సీజన్ రూ.7 లక్షలు సంపాదిస్తున్నా..
ప్రతి సీజన్ 250 నుంచి 300 గంటల వరకు హార్వెస్టర్ వరి కోత కోస్తుంది. గంటకు రూ.2600 తీసుకుంటున్న. 2023 మార్చిలో నేను ఈ హార్వెస్టర్ రూ.31 లక్షలు పెట్టి తీసుకున్న. ప్రతి సీజన్ రూ.7 లక్షల వరకు సంపాదిస్తున్న. మా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు హార్వెస్టర్ కిరాయికి తీసుకెళ్తారు. ఉన్న ఊరిలోనే ఉంటూ ఉపాధి పొందుతున్న. రెండు సీజన్ పని దొరుకుతున్నది. వర్షాలు బాగా పడుతుండడంతో రైతులు చెరువులు, బోర్ల వద్ద పంటలు బాగా వేస్తున్నారు.
– సత్యనారాయణ, హార్వెస్టర్ యజమాని, ఫరీద్ మెదక్ జిల్లా