సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఆయకట్టుకు సాగునీరు అందని దయనీయ పరిస్థితి నెలకొంది. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కండ్ల ఎదుట పంటలు ఎండిపోతుండటంతో రైతులు కంటతడి పెడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్‌హాలిడే ప్రకటించటం రైతులకు శాపంగా మారింది. కాల్వల లైనింగ్ పనుల కోసం యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడేపై నీటిపారుదల శాఖ ప్రచారం చేయకపోవటంతో రైతులు కాల్వల కింద వరి ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం కాల్వల ద్వారా సాగునీరు నిలిచిపోయింది.
దీనికితోడు బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటడం, కరెంటు సమస్యలతో వరి పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సింగూరు ప్రాజెక్టు దిగువన వరి పొలాలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గటం, కరెంటు సమస్యలు ఉన్నందున పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. నల్లవాగు ప్రాజెక్టు కింద సైతం ఇదే సమస్య ఉంది. ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు సాగునీరు అందకపోవటంతో వరి, జొన్న పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు నల్లవాగు నుంచి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి మార్చి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో పంటల సాగు గణనీయంగా తగ్గింది. ప్రస్తుత యాసంగి సీజన్లో 1.95 లక్షల ఎకరాలకు పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, 1.15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. 95వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేయగా 40వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయ్యింది. ప్రాజెక్టులు, చెరువుల కింద పంటల సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సింగూరు ప్రాజెక్టు కింద కాల్వల లైనింగ్ పనులు ఉండటంతో యాసంగి సీజన్లో ఇరిగేషన్ శాఖ క్రాప్ హాలిడే ప్రకటించింది. క్రాప్‌హాలిడే అంశం ప్రచారం జరగకపోవటంతో రైతులు బోరుబావులు, కాల్వల కింద పంటలు సాగుచేశారు.
సింగూరు ప్రాజెక్టు కింద యాసంగి సీజన్లో 25వేల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా, 16వేల ఎకరాల్లో సాగు అయ్యాయి. నల్లవాగు ప్రాజెక్టు కింద 6030 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా 4089 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో 500 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 15 ఉన్నాయి. ఈ చెరువుల కింద యాసంగి సీజన్లో 15వేల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా, 4100 ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యాయి. మిగతా చెరువుల కింద 89వేల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 40వేల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు.
సింగూరు కింద ఎండుతున్న పంటలు
సింగూరు ప్రాజెక్టు కింద ప్రస్తుతం సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కండ్ల ఎదుట పంటలు ఎండిపోతుండటంతో రైతులు సింగూరు ప్రాజెక్టు కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యాసంగి సీజన్లో సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్‌హాలిడే ప్రకటించారు. క్రాప్‌హాలిడే అంశం రైతులకు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో రైతులు కాల్వలు, బోరుబావుల కింద పంటలు వేశారు. సింగూరు ప్రాజెక్టు ఎడమ కాల్వ దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లోని రైతులు 16వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు వేశారు. క్రాప్‌హాలిడే నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు పూర్తిగా నిలిపివేశారు. భూగర్భజలాలు పడిపోతుండటంతో బోరుబావులు నీళ్లు పోయటం లేదు. దీనికితోడు కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో పుల్కల్, చౌటకూరు మండలాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి.
దీంతో రైతులు సింగూరు నుంచి కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీ కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.54 టీఎంసీల జలాలు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల కింద మొత్తం 68 కిలోమీటర్ల కాల్వల లైనింగ్ పనులు రూ.153 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.133 కోట్లతో కాల్వల లైనింగ్ పనులను సీవేట్ అనే నిర్మాణ సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం కాల్వల్లో పూడికతీత, జంగల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి. ఇంకా లైనింగ్ పనులు ప్రారంభం కానందున ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగునీరు ఇచ్చాక తిరిగి లైనింగ్ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని, పంటలు కాపాడేందుకు వీలుగా సాగునీరు ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
Medak5
నల్లవాగు కింద సాగునీటి కోసం డిమాండ్
నల్లవాగు ప్రాజెక్టు కింద సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్లవాగు ప్రాజెక్టు పూర్తి నిల్వసామర్థ్యం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1485.6 ఫీట్ల మేర జలాలు ఉన్నాయి. యాసంగి సీజన్లో ప్రాజెక్టు దిగువన కుడి, ఎడమ కాల్వల కింద 6,030 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, 4,090 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. యాసంగి సీజన్లో రైతులు ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్ తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా వరి పంట వేశారు. ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు మూడు విడతలుగా సాగునీరు విడుదల చేశారు. రైతులు వరి పంట సాగు చేయటంతో మరో రెండు విడదలు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టెయిల్ఎండ్లో ఉన్న కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ గ్రామాల్లోని పొలాలకు సాగునీరు అందకపోవటంతో వరి, జొన్న పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడేందుకు వీలుగా నల్లవాగు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పక్కనే రిజర్వాయర్ ఉన్నా..
కొమురవెల్లి, మార్చి 11: రిజర్వాయర్ పక్కనే ఉన్నా తపాస్‌పల్లి రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన కంకణాల చంద్రం ఎకరం 30 గుంటల్లో వరి సాగు చేశాడు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో పంటను కాపాడుకునేందుకు ఇటీవల రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. అప్పటికే 20 గుంటల వరి ఎండిపోయింది. మరో 20 గుంటల వరి పంటకు నీళ్లు అందడం లేదు. దీంతో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతు చంద్రం రోజుకు రూ.2వేల వరకు వెచ్చించి వాటర్ ట్యాంకర్ ద్వారా పంటకు నీళ్లు అందిస్తున్నాడు. పక్కకే తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా సరిగ్గా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
నీళ్లు ఇచ్చి పంటలను బతికించండి
యాసంగిలో నాలుగు ఎకరాల్లో పంటలు వేశాను. మూడు ఎకరాల్లో చెరుకు, ఎకరంలో వరి పంట వేశాను. నీళ్లు లేక వరి పంట పూర్తిగా ఎండిపోతుంది. చెరుకు పంట ఎండిపోవటం ప్రారంభమైంది. భూగర్భ జలాలు పడిపోవటంతో బోర్లు పోయటం లేదు. సింగూరులో నీళ్లు ఉన్నందున కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చి ప్రాజెక్టు కింద రైతులను ఆదుకోవాలి. – లక్ష్మయ్య, రైతు, ముద్దాయిపేట
పంట ఎండిపోతుంది.. ఆదుకోండి
యాసంగి సీజన్లో ఆరు ఎకరాల్లో వరి పంట వేశాను. ఇప్పుడు నీళ్లు లేక పంట ఎండిపోతుంది. మరికొద్ది రోజులు నీళ్లు లేకపోతే వేసిన పంట అంతా ఎండిపోయే ప్రమాదం ఉంది. సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్‌హాలిడే ఉందని, కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వటం లేదు. సింగూరు కాల్వల లైనింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నందున ప్రభుత్వం రైతుల పరిస్థితిని గమనించి సింగూరు నుంచి కాల్వల ద్వారా పొలాలకు
నీళ్లు ఇవ్వాలి. – రాజేందర్, రైతు, పుల్కల్