ఇతర పంటలు వేసిన ‘ప్రథమ’ మహిళ
సీఎం కేసీఆర్ సూచనలతో పంట మార్పిడి
గోసాన్‌పల్లిలో ఆరుతడి పంటలకు శ్రీకారం
ఆరు ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో కూరగాయలు,
ఐదు ఎకరాల్లో చెరకు పంట
కూరగాయల సాగుతో అత్యధిక లాభాలు
దుబ్బాక, ఫిబ్రవరి 26: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మార్కెట్ డిమాండ్‌ను బట్టి సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే బాటలో పయనిస్తున్నది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లి సర్పంచ్ దొందడి లక్ష్మి. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అధైర్యపడకుండా సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాతో ఇతరపంటలపై మిగతా రైతులకు అవగాహన కల్పిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి అందరికంటే ముందుగా తమ పొలంలోనే వివిధ పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఒక పక్క గ్రామ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే మరోపక్క వ్యవసాయంలో లాభాలు గడిస్తూ చుట్టు పక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష్యసాధింపు ధోరణితో వ్యవహరిస్తుండడంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దుబ్బాక మండలం గోసాన్‌పల్లి సర్పంచ్ దొందడి లక్ష్మి ఇతర పంటలకు శ్రీకారం చుట్టింది. యాసంగిలో వరి పంట వేసి ఇబ్బందులు పడొద్దని గ్రామ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అందరికంటే ముందు తనే ఇతర పంటలను సాగు చేస్తున్నది. తమకున్న 15 ఎకరాల్లో మొక్కజొన్న 6 ఎకరాలు, కూరగాయలు 4 ఎకరాల్లో సాగు చేపట్టింది. మరో 5 ఎకరాల్లో చెరుకు పంట సాగుచేస్తున్నది.
యాసంగిలో వివిధ రకా ల పంటల సాగు..
వానకాలంలో సర్పంచ్ లక్ష్మి తమకున్న 15 ఎకరాలతో పాటు చుట్టు పక్కల రైతులకు చెందిన మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంట పండించింది. తలాపునే (నర్మాల ప్రాజెక్టు) అప్పర్ మానేరు జలాలు పుష్కలంగా ఉండటంతో ప్రస్తుత యాసంగిలో మరిన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని వరిసాగు చేయాలని భావించింది. సీఎం కేసీఆర్ సూచనలతో 15 ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలను సాగు చేస్తున్నది. ముందుగా, పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి యాసంగిలో ఇతర పంటల సాగు కోసం వ్యవసాయాధికారులతో రైతులకు మెళకువలు నేర్పించింది. మాటల్లో కాకుండా ఆచరణలో ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ లక్ష్మి, ఆమె కుమారుడు తిరుపతిరెడ్డి ఇతర పంటల సాగును ప్రారంభించారు. ఇందులో 4 ఎకరాల్లో కూరగాయలు, 6 ఎకరాల్లో మొక్కజొన్న, 5 ఎకరాల్లో చెరుకు పంట సాగును చేపట్టారు. కూరగాయల సాగులో అరఎకరం చొప్పున 8 భాగాలు చేసి ఒక్కో భాగంలో ఒక్కో కూరగాయ పంటను పండిస్తున్నారు. బిర్నీస్, చిక్కుడు, పచ్చి మిర్చి, కంది, పెసర, టమాట, బీరకాయ, ఉల్లి, కొత్తిమీర, మెంతి పంటలను వేశారు. పండించిన కూరగాయాలను రెండు, మూడు రోజులకోసారి ఆటోలో సిద్దిపేట రైతు మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. సర్పంచ్ లక్ష్మీని ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని పలువురు రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చి సాగు విధానాలు తెలుసుకుంటున్నారు.
కొడుకు సహకారంతోనే సాగు
సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాసంగిలో వరి పంట వేయొద్దని మా గ్రామంలో రైతులకు సూచించాం. ఇక్కడి రైతులు వరికి ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో వారి ఆలోచనలు మార్చేందుకు ముందుగా మనమే ఇతర పంటలను సాగు చేద్దామని మా కొడుకు తిరుపతిరెడ్డి అన్నాడు. దీంతో మొత్తం 15 ఎకరాల్లో 6 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 4 ఎకరాల్లో కూరగాయలు, మిగిలిన దాంట్లో చెరుకు పండిస్తున్నాం. రోజూ కుటుంబ సభ్యులం అందరం పొలానికి వచ్చి కూలీలపై ఆధారపడకుండా కలిసి పని చేస్తాం. కూరగాయలు పండిస్తే ఆదాయం మంచిగానే ఉంది. – దొందడి లక్ష్మి, గోసాన్‌పల్లి సర్పంచ్
ఇతర పంటలు వేయడం ఇదే తొలిసారి..
మా పొలం పక్కన నర్మాల అప్పర్ మానేరు (నర్మాల ప్రాజెక్టు)లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ వరి పంట వేసేటోళ్లాం. మాకున్న పొలంతో పాటు చుట్టు పక్కల పొలాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేసేవాళ్లం. సీఎం కేసీఆర్ సూచనలతో ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేస్తున్నాం. కూరగాయలు, మొక్కజొన్న, చెరుకు పంటలు పండిస్తున్నాం. ప్రస్తుతం, కూరగాయల పంటలతో లాభాలు వస్తున్నాయి. వరి వేసి ఇబ్బందులు పడేదానికంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడమే ఉత్తమం.
– దొందడి తిరుపతిరెడ్డి