ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు ఆస్తినష్టం జరిగింది. గాలిదుమారంతో విద్యుత్ స్తంభాలు నేలకూలడం, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. నిన్నమొన్నటి వరకు నీళ్లులేక పంటలు ఎండిపోగా, శుక్రవారం గాలిదుమారానికి పంటలు నేలవాలగా రైతులకు నష్టం వాటిల్లింది.
పెద్దశంకరంపేట, మార్చి 22: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని వీరోజిపల్లి, ఉత్తులూర్, రామోజిపల్లి, నారాయణపల్లి, జూకల్ గ్రామాల్లో సుమారు 30 ఎకరాల జొన్న పంట నేలకొరిగింది. ఉత్తులూర్‌లో రైతులు చంద్రాగౌడ్, సతీష్, జీవయ్య, వీరోజిపల్లి గ్రామానికి చెందిన రైతులు శివరాములు, సాయిలు, కృష్ణ,గోవింద్, సంగయ్యకు చెందిన జొన్నపంట దెబ్బతిన్నది. పంటనష్టం వివరాలను అంచనావేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని మండల వ్యవసాయాధికారి కృష్ణ, ఏఈవో మమత తెలిపారు.
చిన్నశంకరంపేట, మార్చి 22 : మండలంలో గాలిదుమారానికి రెండు ట్రాన్స్ఫార్మర్లు, 55 కరెంటు స్తంభాలు నేలకొరిగాయని ట్రాన్స్‌కో ఏఈ దినకర్ తెలిపారు. శనివారం ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు నిర్వహించి కరెంట్ సరఫరాను పునరుద్ధ్దరించారు. చెట్లు రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సూరారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చందాపూర్‌కు చెందిన శోభ, మహేశ్వరి, హేమలత, శారద, పుష్పమాలకు చెందిన నివాస రేకులు షెడ్లు, పూరిగుడిసెలు కూలిపోయాయి. చందాపూర్ శివారులో వర్షంతో దెబ్బతిన్న పంటను ఏడీఏ విజయ నిర్మల, ఏవో లక్ష్మీప్రవీణ్ పరిశీలించారు. గాలివానకు మామిడికాయలు నేలరాలాయి.
చేగుంట, మార్చి 22: చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి, మక్కరాజిపేట్, రాంపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. కర్నాల్పల్లికి చెందిన రైతు రాజాగౌడ్ ఐదెకరాల చేనులో మొక్కజొన్న, ఎకరన్నరలో తెల్లజొన్న పంట నేలకొరిగింది.
వెల్దుర్తి, మార్చి 22: మండలంలోని బండపోసాన్‌పల్లి, శెట్పల్లి, ఏదులపల్లిలో శుక్రవారం రాత్రి గాలిదుమారంతో పలువురి నివాస ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్ద చెట్లు నేలవాలగా, విద్యుత్ తీగలు తెగిపడడంతో పాటు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బండపోసాన్‌పల్లిలో శుక్రవారం రాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్తులు, పంచాయతీ కార్మికుల సహాయంలో చెట్లకొమ్మలను తొలిగించి, తీగలు సరిచేసి విద్యుత్ తీగలను సరిచేస్తూ, స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. శెట్పల్లిలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభం విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బండపోసాన్‌పల్లి, శెట్పల్లి, ఏదులపల్లి గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మామిడికాయలు భారీగా రాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
పాపన్నపేట, మార్చి 22: పాపన్నపేట మండలంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం పాపన్నపేట మండలంలో గాలిదుమారంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండడంతో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం కూడా కరెంటు పోవడంతో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు నడవక ఉక్కపోతకు గురయ్యారు.