చేర్యాల, అక్టోబర్ 9 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువు(డ్యాం)లోకి గోదావరి జలాలను సంబంధిత శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విడుదల చేయడంతో అధికంగా నీరు చేరి నాగపురి గ్రామానికి చెందిన 25 మంది రైతుల పంట పొలాలు నీటమునిగాయి. కొన్ని రోజులుగా మారెడ్డి చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంక్ సామర్ధ్యాన్ని మించి నీటిని విడుదల చేయడంతో బ్యాక్ వాటర్ ఎక్కువై కోతకు వచ్చిన వరి పంట నీటి మునిగి లక్షలాది రుపాయలు నష్టపోయామని నాగపురి రైతులు లబోదిబోమంటున్నారు.
నీటిలో మునిగిన పంటను రక్షించుకునేందుకు వేకువజామునే ఇంటిల్లిపాది నీటిలోకి దిగి పైపై వరి పంటను కోసుకుంటున్నారంటే వారి ఆవేదన వర్ణాణాతీతంగా ఉంది.పోతిరెడ్డిపల్లిలో 2010లో మారెడ్డి చెరువు తపాస్పల్లి రిజర్వాయర్ కిందభాగంలో ఉండడంతో దేవాదుల అధికారులు చెరువును అభివృద్ధి చేశారు.
ఈ క్రమంలో నాగపురికి చెందిన 170 ఎకరాలు, కడవేర్గుకు చెందిన 30 ఎకరాల భూమిని నీటి మునుగుతుందని రైతుల నుంచి భూమిని సేకరించి వారికి రూ.1.70 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికి ఇటీవల అధికారులు మారెడ్డి చెరువులోకి నీటిని అధికంగా విడుదల చేయడంతో నాగపురికి చెందిన మరో 30 ఎకరాల పంటపొలాలు నీటి మునిగాయి. సుమారు రూ.15లక్షల మేరకు పంటలను నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు భూమి నీట మునగడం మరోవైపు పంటలు కోల్పోవడంతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు. అధికారులు స్పందించి తగు విచారణ జరిపి రైతులకు మొదటగా పంట నష్టపరిహారం మంజూరు చేయించడంతో పాటు భవిష్యత్తులో భూములకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మారెడ్డి చెరువు నీటి సామర్ధ్యం మేరకు జలాలు విడుదల చేయాలని కోరుతున్నారు.