సంగారెడ్డి, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో అంచనాకు మించి పంటనష్టం జరిగింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. తొలుత కొద్దిగా పత్తి పంటనష్టం జరిగిందని భావించారు. 200 ఎకరాల నుంచి లొలుత పంటనష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తీరా క్షేత్రస్థాయిలో సర్వే చేయగా 3367 ఎకరాలకు పత్తిపంట నష్టం చేరుకుంది. సర్వే పూర్తయ్యే వరకు నష్టం 7వేల ఎకరాలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంగారెడ్డి, సదాశివపేట, వట్పల్లి, మునిపల్లి, రాయికోడ్, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండలాల్లో పత్తిపంటకు ఎక్కువగా నష్టం వాటిళ్లింది. ఆయా మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులు పంటనష్టం వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. దీంతో పత్తి పంటనష్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పత్తితో ఇతర పంటలు దెబ్బతినడంతో ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటనష్ట పరిహారం చెల్లింపులో నిబంధనను పక్కనపెట్టి వర్షాలతో పంటదెబ్బతిన్న రైతులందరికీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖ ఇప్పటి వరకు 5వేల మంది రైతులకు చెందిన 7369 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని గుర్తించింది. 120 ఎకరాల్లో పత్తి, 1271 ఎకరాల్లో సోయాబీన్, 1256 ఎకరాల్లో మినుము, 183 ఎకరాల్లో పెసర, 1059 ఎకరాల్లో కంది, ఏడు ఎకరాల్లో చెరుకు,106 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం జరిగింది. వర్షాలతో అత్యధికంగా 2876 మంది రైతులకు చెందిన 3367 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగింది. మునిపల్లి మండలంలో1034, వట్పల్లిలో 734, న్యాల్కల్లో 594, చౌటకూరులో 435, సదాశివపేటలో 127, సంగారెడ్డిలో 127, జహీరాబాద్‌లో 104, రాయికోడ్‌లో 97, పుల్కల్లో 36 ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లింది.
అధిక వర్షాలతో అం దోలు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పత్తిపంట నీట మునిగటంతో రైతులు నష్టపోయారు. తాజాగా ఎండుతెగులు పత్తి పంటను పట్టిపీడిస్తున్నది. ఎండుతెగులు కారణంగా పత్తిచెట్లు పూర్తిగా ఎండిపోయి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎండుతెగులుతో పత్తి పూత, కాయ రాలిపోవడంతో పాటు ఏకంగా చెట్లు ఎర్రగా మారి ఎండిపోయి నేలపై పడిపోతున్నాయి. పంటనష్టంఎక్కువగా ఉన్న మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులు పత్తిపంట నష్టం వివరాల సేకరణ ఇంకా కొనసాగిస్తున్నారు. దీంతో దీంతో పత్తిపంట నష్టం 7వేల ఎకరాలు దాటే అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దిగుబడి సైతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో వర్షాలకు 3367 ఎకరాల్లో పత్తిపంట నీటమునిగింది. పత్తిపంట నష్టం వివరాల సేకరణ ఇంకా కొనసాగున్నది. భారీ వర్షాలకు పత్తి నీటమునగడంతో పాటు ఎండుతెగులు సోకి నష్టం వాటిళ్లుతున్నది. ఎండుతెగులు నివారణకు రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్(19ః19ః19) ఉన్న పాలిపీడ్ ఎరువులు పత్తి పంటకు వేసుకోవాలి. కాపర్ ఆక్సీఫ్లోరైడ్ మందు ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి పత్తిచెట్టు వేర్లు ఉన్నచోట పిచికారీ చేయాలి. కార్బెండజిమ్ -మాన్కోజెబ్ మందు ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పత్తి చెట్టు వేర్లు మొదలులో పిచికారి చేయాలి.
– శివప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి,సంగారెడ్డి జిల్లా