నారాయణఖేడ్, ఫిబ్రవరి 12: అనేక హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సైతం చేపట్టకపోవడం మూలంగా ప్రజ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి చేయడం చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని జూకల్ క్రాస్‌రోడ్డులో రాస్తారోకో చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. నారాయణఖేడ్ నుంచి జూకల్, చందాపూర్, సత్యగామ, అనంతసాగర్, బండ్రాన్‌పల్లి వరకు రోడ్డు అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ.1.48 కోట్లు మంజూరు చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది గడిచినా రోడ్డు పనులు ఎందుకు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇదే రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకుడు చేశారని, నాణ్యతాలోపంగా పనులు చేపట్టడంతో రెండేండ్లలోనే రోడ్డు గుంతలమయంగా తయారైందన్నారు. అనంతసాగర్ నుంచి మియాపూర్ తండాకు రూ.1.32 కోట్లు, అంత్వార్ నుంచి సత్యగామ క్రాస్‌రోడ్డు వరకు రూ.33 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల నిర్బంధాలతో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు.
హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నదని విమర్శించారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో 50 ఏండ్ల కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధిని తాను కేవలం ఏడేండ్లలో చేసి చూపించినట్లు మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో బడా భూస్వాములకు లక్షల కొలది రైతుబంధు వచ్చిందని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేకు, అతడి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పడం లేదని, నిజాయతీ ఉంటే తీసుకున్న రైతుబంధు తిరిగి ప్రభుత్వానికి జమ చేసి మాట్లాడాలని హితవు పలికారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పైసా అభివృద్ధి పని చేయలేదన్నారు. ఇప్పటికైనా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి, పథకాల అమలుకు ఎమ్మెల్యే, ఎంపీ చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గంటపాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకిరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. ఆందోళనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ముజామిల్, విఠల్, వెంకటేశం, లక్ష్మణ్‌రావు, రాజు, నర్సింహులు, సాల్మన్, దత్తు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.