సిద్దిపేట, జూలై 15: సిద్దిపేట జిల్లా పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు… దుబ్బాకకు చెందిన చింత రాజ్‌కుమార్ గతనెల పది రోజులు తీర్థయాత్రలకు వెళ్లాడు.జూన్ 28న అతని ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు దుబ్బాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ రష్మి పెరుమాల్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో దొరికిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు భిక్షపతి అని గుర్తించారు. బుధవారం దుబ్బాక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తొగుట మండలం లింగంపేట వాసిగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన వాటిలో 80తులాల బంగారం, 5.5 కేజీల వెండి, రూ. 1300, రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడిపై తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 63 కేసులు నమోదై జైలుకు వెళ్లినట్లు తెలిపారు. జైలు నుంచి నిందితుడు భిక్షపతి విడుదలకు సహకరించినందుకు వార్డర్ గోపాల్‌తో పాటు నిందితుడు భిక్షపతిపై కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
కేసును ఛేదించిన సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీసీఎస్ ఏసీపీ సదన్ కుమార్, సీసీఎస్ సీఐలు జాన్‌రెడ్డి, రవీందర్, సీఐ వాసుదేవరావు , ఎస్సైలు కీర్తిరాజు ,హరీశ్ , దామోదర్, తిరుపతి, సీసీసీఎస్ బృందం సభ్యులు యాదగిరి, మహేశ్, షరీఫ్ , నగేష్, అశోక్, శివ, సిద్దిపేట డివిజన్ క్రైమ్ సిబ్బంది రాంజీ, భిక్షపతి, అఫ్రోజ్, రాజిరెడ్డి, శరత్, రవి, కిషన్, భూమలింగం, యాదగిరిని పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ అభినందించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకరూ తమ ఇండ్ల వద్ద, కాలనీల్లో, వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. టూర్లు, ఇతర అవసరాల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లేది ఉంటే ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, భారీగా నగదు వంటివి పెట్టి వెళ్లవద్దని ప్రజలకు సీపీ సూచించారు.