నంగునూరు, జూన్ 19 : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మైసంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి ఆయిల్‌పామ్ తోటను గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని నర్మెట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను కేంద్ర అధికారుల బృందం పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఈఫ్యాక్టరీ భారతదేశంలోనే అత్యంత పెద్దదని, ఫ్యాక్టరీ నిర్మాణం అద్భుతంగా ఉందని వారు ప్రశంసించారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతానికి చెందిన రైతులకు ఫ్యాక్టరీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్దూబే, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డీహెచ్‌వో సువర్ణ, ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ భాస్కర్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ, ఫీల్డ్ ఆఫీసర్ నితీశ్‌కుమార్ పాల్గొన్నారు.