రామచంద్రాపురం, జనవరి 3: అతి త్వరలోనే ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్న వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ పుష్పానగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఇతర రాష్ర్టాల ప్రజలు, నేతలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. యావత్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. 70 ఏండ్లు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలతో పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాల్సిన అవసరం ఉన్నదని ఆలోచన చేసి మేధావులు, పండితులు ఇలా అందరి సలహాలు, సూచనలు తీసుకుని సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేశారన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నామన్నారు. కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రల నేతలతో పాటు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ అతి త్వరలో దేశ వ్యాప్తంగా విస్తరించి బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్మామ్నాయ శక్తిగా నిలుస్తుందన్నారు. దేశానికి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు బూరుగడ్డ నగేశ్, మల్లేశ్, వినయ్‌కుమార్, ఎంఏఖాన్, కృష్ణకాంత్, చాంద్, తదితరులు పాల్గొన్నారు.