Government Offices | మెదక్, మార్చి 27(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం లేదు. నిబంధనల పేరుతో సంతకం చేయకుండా తిరస్కరిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్నా పని పూర్తి కావాలంటే రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉంది. అదే దళారుల సహాయంతో వెళ్తే క్షణాలలో ఫైలు చూసి సంతకాలు పెడుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయంలో నిర్ణీత సమయంలో పౌర సేవలు పొందే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఏ సేవలను ఎన్ని రోజుల్లో పొందే వీలు ఉంటుందో కార్యాలయంలో సిటిజన్ చార్టర్లు ఏర్పాటుచేసిన ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వ కార్యాలయంలో దళారులను ఆశ్రయించి ముడుపులు చెల్లించుకుంటే పనులు చేయించుకుని పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాల తీరుపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ఇది..
రెవెన్యూ శాఖలో పనులు కావాలంటే ముందుగా మీసేవ నిర్వాహకులను కలవాల్ససిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. రైతుల పాస్ పుస్తకాలు 1బి తో పాటు ఇతర రిజిస్ట్రేషన్లు కావాలంటే ముందుగా మీసేవ నిర్వాహకులను సంప్రదించాల్సి వస్తుంది. కొందరు రెవెన్యూ అధికారులు మీసేవ నిర్వాహకులను మధ్యవర్తిగా చేసుకుని మామూళ్లు వసూలు చేస్తున్నారు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రం తోపాటు నివాస ధ్రువీకరణ పత్రం కావాలన్నా మీసేవ నిర్వాహకులకు డబ్బులు ఇవ్వవలసిన పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్ లో చిన్న తప్పు ఉన్నా రిజిస్ట్రేషన్ చేయకుండా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనులు కావాలంటే నిర్వాహకులకు ముందుగానే డబ్బులు చెల్లించాలి. తాసిల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకపోవడంతో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి.
రెవెన్యూ శాఖలో పారదర్శకంగా పాలన అందించే వరకూ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయడం లేదు. కొందరు అధికారులు నేరుగానే డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్లోనూ అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి. మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా పోలీస్ శాఖ దాడులు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మాఫియా నిర్వాహకులు పోలీస్ అధికారులకు ప్రతినెల మామూళ్లు ఇచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి సామాన్యుడు అంత సులువుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్ కు పోవాలంటే సామాన్య ప్రజలు భయపడి పరిస్థితి ఉంది. ఏ సాయం కావాలన్నా గ్రామ స్థాయి నేతలను వెంట తీసుకుని పోవలసిన పరిస్థితి ఉంది. కుటుంబ తగాదాలు, భూ సమస్యలు పరిష్కారం కోసం మధ్యవర్తులను తీసుకొని పోవాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో పని పూర్తి కాగానే మధ్యవర్తులకు డబ్బులు అప్పజెప్పితే వారు సంబంధిత అధికారులకు ముడుపులు అప్పగిస్తున్నారు. ఇలా పోలీస్ శాఖలో అక్రమాలు పెరిగిపోయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం భారీగా డబ్బులు తీసుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నా.. స్తంభాలు వేయాలన్నా మధ్యవర్తుల ద్వారా వెళ్తేనే పనులు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖలను అవినీతి అక్రమాలు పెరిగిపోయినా ఏసీబీ అధికారులు దాడులు చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. నిబంధనల పేరుతో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. గ్రామస్థాయిలో లైన్ మన్, ఎలక్ట్రిషన్‌ను మధ్యవర్తులుగా చేసుకొని కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తులు తీసుకొని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా డబ్బులు వసూలు చేసి పనులు చేస్తున్నారు . కొత్త మీటర్ కావాలన్నా మధ్యవర్తుల ద్వారా పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంటి పన్నులు రసీదుతోపాటు, యజమాని ధ్రువీకరణ పత్రం లేనిది కొత్త కనెక్షన్ ఇవ్వలేదని చెప్తున్నారు. నిబంధనల పేరుతో డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో నేరుగా వెళ్లి కొత్త మీటర్లు దరఖాస్తు చేసిన తిరస్కరిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి అని ఫిర్యాదులు వస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
మెదక్ పట్టణంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఏ పని కావాలన్నా మధ్యవర్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిందే. నేరుగా వెళ్తే గంటల తరబడి నిలబడే పరిస్థితి ఉండటంతో పాటు పని అయితదని నమ్మకం లేకుండా పోయింది. కార్యాలయం బయట దళారులు పాగా వేసి సేవలను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించినప్పటికీ అధికంగా దళారుల చేతుల్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మెదక్ ఆర్టీవో కార్యాలయంలో దళారుల రాజ్యం నడుస్తుంది. ఆర్టీవో కార్యాలయంలో లెర్నింగ్ లైసెన్స్‌తో పాటు పర్మినెంట్ లైసెన్స్, ఇతర పనుల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిబంధనల పేరుతో మామూళ్లు తీసుకుంటున్నారు. ఆర్టిఏ కార్యాలయంలో దళారుల దండ లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్టాంపులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. దళారులతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుని రిజిస్ట్రేషన్ శాఖలో పనులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న కార్యాలయంలో అక్రమాలు భారీగా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆవరణలో దళారులు ప్రమేయం లేకుండా ఏ పనులు జరగడం లేదు. జిల్లాలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు నేరుగా చేసుకునే పరిస్థితి లేదు. డాక్యుమెంట్ రైటర్లతో వెళ్తేనే పనులు జరుగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా ఉండి ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి డాక్యుమెంట్ వచ్చినా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. కొంతమంది అధికారులు బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయినా అధికారులు నివారించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.