సిద్దిపేట, మే 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి బాగా పెరిగిపోయింది. లంచం తీసుకునే అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏశాఖ చూసినా ఏమున్నది గర్వకారణం…డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. పైస్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులను, వారి వద్దకు వచ్చిన వారిని డబ్బులకు పీడిస్తున్నారు. పైఅధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది తప్పులు చేస్తున్నారు. వేలాది రూపాయల వేతనం వస్తున్నప్పటికీ కొందరు అధికారులు లంచాలకు ఆశపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిశాఖల్లో లంచాలు ఇవ్వనిదే పనులు కావడం లేదు.
నిబంధనల ప్రకారం కావాల్సిన పనులకు సైతం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా రెవె న్యూ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయ్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలతో పాటు కలెక్టరేట్లు, మండల పరిషత్‌లు, తహసీల్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లలో అవినీతి బాగా పెరిగింది. ఉన్నత స్థాయి అధికారులు లంచాల కోసం కింది స్థాయి ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల పలువురు అధికారులు లంచాలు తీసుకొని పట్టుబడినా చాలామంది అధికారుల్లో మార్పు రావ డం లేదు. పైగా లంచాలు తీసుకునేటప్పుడు తెలివిగా వారి డ్రైవర్, కుటుంబ సభ్యులు, తెలిసినవారి యూపీఐ నెంబర్ల ద్వారా లంచం డబ్బులు వేయించుకుంటున్నట్లు తెలిసింది. కొందరు మండల స్థాయి అధికారులు గ్రామా ల పర్యటనకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి, గ్రామస్థాయి ఉద్యోగుల నుంచి పెట్రో, డీజిల్, ఫుడ్ ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
టూర్ విజిట్ పేరున ఉన్నతాధికారి వస్తున్నాడంటే కిందిస్థాయి ఉద్యోగికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ అధికారి ఫీల్డ్‌కు వచ్చాడంటే, అతనికి ఎంతో కొంత ముట్టజెప్పాలి, లేకపోతే రికార్డులు తీసుకుపోయి సాయంత్రం జిల్లా ఆఫీసుకు వచ్చి కలిసి పోవాలి అని ఆదేశాలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి తన దగ్గర డబ్బులు లేవని చె ప్పినా వినకుండా ఒక అధికారి అతన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఫైల్ క్లియర్ కావాలన్నా బహిరంగంగానే అధికారులు డబ్బులు అడగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇస్తేనే ఫైల్ క్ల్లియర్ చేస్తున్నారు, లేకపోతే ఫైల్ తొక్కిపెడుతున్నట్లు తెలిసింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులు తెలివిగా తప్పంచుకొని, తమ కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఇరికించి బలిపశువులను చేస్తున్నట్లు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తెలుస్తున్నది. అవినీతి శాఖ అధికారులకు పట్టుబడ్డది కొద్దిమంది మాత్రమే ..అవినీతి శాఖ నుంచి తప్పించుకునే అధికారులు చాలామందే ఉన్నారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ తహసీల్ కార్యాలయంలోకి విలేకరులకు అనుమతి లేదని ఏకంగా బోర్డు పెట్టారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు సంతోష్‌గౌడ్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ హోంగార్డు వెనుక అదే స్టేషన్లో పనిచేస్తున్న పైఅధికారులు ఉన్నారు. కానీ, పట్టుబడింది మాత్రం హోంగార్డు. అతని పైఅధికారులు సేఫ్ అయ్యారు. పట్టుబడక పోతే వాటాల కోసం అతని వద్ద ముక్కుపిండి తీసుకునే వారు. ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇసుక, గంజాయి తదితర మాఫియాలకు పోలీసులే ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలు జిల్లాలో బలంగా ఉన్నాయి.రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వంతో పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు పూర్తి అడ్డాగా మారాయి.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తే ఎంతోకొంత ముట్టజెప్పనిదే పనికావడం లేదు.వ్యక్తిగత వివాదాలు,భూతగాదాల్లో తలదూర్చడం, అందినకాడికి దోచుకోవడం పోలీసులకు అలవాటుగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీస్ అధికారుల తీరు పోలీస్ శాఖకు మచ్చను తెస్తున్నది. నెలనెలా వసూళ్లకు ప్రత్యేకంగా ఒక చిరుద్యోగిని నియమించుకుంటున్నారంటే ఏ మేరకు వసూళ్లకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఏకంగా ఒక ఎస్సై అధికారి పార్టీ నాయకుడి బర్త్‌డే వేడుకలను ఏకంగా తన ఛాంబర్లో జరిపించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరు ఉన్న పోలీస్ శాఖకు ఆ శాఖ ఉద్యోగులే మచ్చతెస్తున్నారు.