సిద్దిపేట, మార్చి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పశ్చిమాసియా యుద్ధం ప్రభావంలో వంటగ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో సమస్య ఏర్పడుతున్నది.
రోజువారీగా జిల్లాలకు వచ్చే గ్యాస్ సిలిండర్ల లారీల సంఖ్య తగ్గింది. గతంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయ్యాక కంపెనీలు డబ్బులు తీసుకునేవారు. ప్రస్తుతం డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ సిలిండర్లు డీలర్లకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా సరఫరా ఆలస్యంగా జరుగుతున్నది. ఆన్లైన్లో బుకింగ్ చేసినా 10 నుంచి 15 రోజుల వరకు సిలిండర్ అందడం లేదు. కొన్నిచోట్ల బ్లాక్ మారెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గృహ గ్యాస్ కనెక్షన్లు 12,05,132, వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు 4,799 ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో గృహ 3,82,250, వాణిజ్య 1,513, మెదక్ జిల్లాలో గృహ 2,35,412, వాణిజ్య 460, సంగారెడ్డి జిల్లాలో గృహ 5,86,870, వాణిజ్య 2,286 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల లెక్కల తెలుపుతున్నాయి. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. వినియోగదారులు కొంత అవసరం ఉండి, అవసరం లేకున్నా గ్యాస్ బుకింగ్ చేసుకోవడంతో గ్యాస్ కొరత ఏర్పడుతున్నది.
ఒక్కో ఏజెన్సీలో సరాసరి రోజు వారి బుకింగ్ కంటే అధికంగా గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒకవైపు గ్యాస్ సరఫరా లేదంటూనే మరోవైపు గ్యాస్ కొరత సృష్టిస్తూ వినియోగదారుల వద్ద అధిక ధరకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల గ్యాస్ కొరతతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ రద్దు చేశాయి. ప్రభుత్వ వసతి గృహా ల్లో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చూ స్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో చాలామంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. గృహాలకు వాడే గ్యాస్‌ను వ్యాపారులకు దొడ్డిదారిన అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ. 400 నుంచి రూ. 500 వరకు తీసుకుంటున్నారు. గ్యాస్ ధరలను అధికంగా పెంచేశారు. గృహ అవసరాల సిలిండర్ తప్పనిసరి కావాల్సినవారు ఎంత లేదన్నా రూ. 1400 నుంచి 1600 వరకు చెల్లిస్తున్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 2400 నుంచి 2600 వరకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల కొరత ఉండడంలో గృహ గ్యాస్‌ను వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల గృహ సిలిండర్ల గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలో నింపుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వ్యాపారులపై అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు.