మెదక్ అర్బన్, జూన్ 27 : మెదక్ పట్టణంలోని బాలిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’లో పనులు చేసిన కాంట్రాక్టర్ దశరథ్(45)కు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో శనివారం గుండెపోటుకు గురై మృతిచెందాడు. పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని పలుసార్లు అధికారులను దశరథ్ కోరారు. రాష్ట్ర సచివాలయంలో ఎదుట ధర్నా చేసినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు.
బిల్లుల కోసం ధర్నా చేసిన దశరథ్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడేండ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నాడు. రూ.20 లక్షల వరకు బిల్లులకు రాక వడ్డీలు ఎక్కువయ్యాయి. దీంతో కొద్దిరోజులుగా మనస్తాపంగా ఉన్నాడు. శనివారం గుండెపోటుకు గురై మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడు దశరథ్కు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం మెదక్ మండలంలోని తిమ్మక్కపల్లిలో నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.