పటాన్చెరు, మార్చి 4: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కలుషిత నీరు సరఫరా అయ్యింది. తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఇస్నాపూర్‌లో వారంలో ఒక రోజు మాత్రమే బల్దియా నీటిని సరఫరా చేస్తున్నది. మంగళవారం సరఫరా చేసిన తాగునీరు మురికిగా, లేత పసుపురంగులో ఉంది. దీంతో కాలనీవాసులు ఈ నీటిని బిందెల్లో పట్టుకోలేదు. ఇస్నాపూర్‌కు మిషన్ భగీరథ నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. అదే సమయంలో జనాభాకు సరిపోను నీరు పైనుంచి రావడం లేదని మున్సిపల్ నీటి పంపిణీని చూసే సిబ్బంది ఆ నీటిలో బోరునీటిని సంపులో తాగునీటితో కలిపి సరఫరా చేశారు.
పరిశ్రమలతో ఇక్కడి భూగర్భజలాలు కలుషితం అయ్యాయి. ఈ నీటిని వాడుకోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. అయినా మున్సిపల్ సిబ్బంది ఈ నీటినే పైనుంచి వస్తున్న మంజీరా నీటిలో కలిపి సరఫరా చేస్తున్నారు. పైగా పలుచోట్ల మురుగునీటి గుంటల్లోంచి ఈ పైప్లైన్లు వేయడంతో ఈ మురుగునీరు తాగునీటిలో కలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు కాలుష్యం నీరు, అటు మురుగునీరు కలుస్తుండడంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే తమ కాలనీకి తాగునీరు సరఫరా అవుతున్నదని ఇస్నాపూర్వాసులు ఆరోపిస్తున్నారు.
ముత్తంగిలో నెలకు నాలుగు రోజులే సరఫరా..
ముత్తంగి గ్రామాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆరునెలల క్రితం మున్సిపాలిటీలో కలసిన ముత్తంగి గ్రామస్తులకు తాగునీరు అందని ద్రాక్షగా మారింది. అటు మిషన్ భగీరథ సిబ్బంది నిర్లక్ష్యంతో పైనుంచి ప్రధాన లైన్ల ద్వారా నీటి సరఫరా తగ్గింది. మరోపక్క వచ్చిన నీటిని గ్రామంలో, దత్తాత్రేయకాలనీలో, న్యూటౌన్ కాలనీలో క్రమపద్ధతిలో సరఫరా చేయడం లేదు. పైనుంచి నీరు రావడం లేదని మున్సిపాలిటీ నీటి సరఫరా సిబ్బంది చెబుతున్నారు. మా పైప్‌లైన్‌ను రోడ్డు విస్తరణ కాంట్రాక్టర్ పగులగొడుతున్నాడని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. ఆరునెలల నుంచి ముత్తంగికి వారంలో ఒక రోజు మాత్రమే తాగునీరు సరఫరా అవుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.