చేర్యాల, డిసెంబర్ 18 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం లో రూ.12కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు నాసిరకం గా జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.ఇటీవల క్యూ కాంప్లెక్స్ భవనం రెండో అంతస్తులో వివిధ డిజైన్లతో నిర్మించిన ఓ నిర్మాణం కూలిపోగా దానికి మరమ్మతు చేశారు. తాజాగా మొదటి అంతస్తులో వెలుతురు పడేందుకు, వర్షం కురిస్తే నీళ్లు లోపలికి రాకుండా ఏర్పాటు చేసే నిర్మాణానికి సంబంధించిన ఓ నిర్మాణం కూలిపోయింది. దీంతో కాంట్రాక్టర్ మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. వేలాదిమందికి ఉపయోగపడే క్యూకాంప్లెక్స్ నిర్మాణాలు ప్రారంభానికి ముందే కూలిపోతుంటే భవిష్యత్‌లో పరిస్థితి ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
భక్తుల వసతి కోసం ఉపయోగపడే భవనాల నిర్మాణ పనుల్లో ఆలయవర్గాలు నాణ్యతతో పనులు చేయించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. దేవాదాయశాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అధికారులు కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై ఆలయ ఈవో బాలాజీని నమస్తే తెలంగాణ ఫోన్లో వివరణ కోరగా క్యూ కాంప్లెక్స్‌కు సంబంధించిన నిర్మాణ పనులు క్వాలిటీతో కొనసాగుతున్నాయన్నారు. ఎలాం టి నాసిరకం పనులు జరగడం లేదని, పరద గోడలు ఎక్కువ మందగా ఏర్పాటు చేయగా అవి వంగిపోతుండడంతో వాటిని సరిచేశారన్నారు.