గజ్వేల్, ఆగస్టు 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పనులు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో వర్షం పడితే ప్రయాణికులు తలదాచుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులపై ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో గజ్వేల్ పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాఫూర్‌లో బస్టాండ్ నిర్మాణాల పనులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలలు నిలిచిపోయాయి. గజ్వేల్‌లో కొద్ది నెలల తర్వాత ప్రారంభమైన పనులు కలర్స్ వరకు పూర్తి చేయగా తర్వాత మళ్లీ పనులను నిలిపివేశారు. ఇంకా సీసీ రోడ్డు, బాత్రూమ్లు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం అధిక వర్షాలు పడితే ప్రయాణికులు తలదాచుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
గజ్వేల్ పట్టణానికి నిత్యం వేలాదిగా ప్రయాణికులు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు ఆర్టీసీ బస్సులోనే వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వస్తుంటారు. ప్రయాణికుల కోసం గజ్వేల్ పట్టణంలో రూ.2.56కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంబంధిత కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్ల నిర్మాణ పనులను కొన్ని నెలల పాటు అర్ధంతరంగా నిలిపివేశారు. అసంపూర్తిగా వదిలేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 3.81 కోట్లు మంజూరు
ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో రూ.3.81కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం బస్టాండ్ స్లాబు పూర్తవగా, గోడలు నిర్మాణ దశలోనే వదిలేశారు. బస్టాండ్ పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోడ్లపైనే నిలబడుతున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో రోడ్లపైనే నిలబడుతున్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని పనులు త్వరగాపూర్తయ్యేలా చూడాలని ప్రయాణికులు, గజ్వేల్, ప్రజ్ఞాఫూర్ పట్టణవాసులు కోరుతున్నారు.