తలాపునే గోదావరి ఉన్నా తడి అందక ఎండిపోతున్న పంటలను చూసి కంటనీరు పెట్టిన మెట్ట రైతన్నల కల నెరవేరిన రోజు అది. దశాబ్దాలుగా సాగునీటి కోసం నిరీక్షిస్తున్న రైతుల ఆశలకు ఆజ్యం పోసిన మంచిరోజు అది. గోదావరి నీళ్లు ఇక తాము కండ్ల జూడలేమని నిరాశతో ఉన్న రైతుల గుండెల్లో ధైర్యం నింపిన సుదినం అది. నెర్రెలు వారిన నేలల్లో సిరులు పండించేందుకు శరవేగంతో దూసుకొచ్చిన గోదారమ్మను చూసి రైతులు పులకరించిన రోజు అదే. కాదనుకున్న దానిని సాకారం చేసి చూపించిన తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్‌కు జేజేలు కొట్టిన రోజు… మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదారమ్మను రైతుల చెంతకు తెచ్చిన ఆ రోజే ‘జూన్ 31, 2022’. హుస్నాబాద్ మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి భారీ మోటార్ల ద్వారా గోదావరి నీళ్లు ఎగిసిపడింది ఈ రోజే…
హుస్నాబాద్, ఆగస్టు 2: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు హన్మకొండ, జనగామ జిల్లాల్లో 1.06లక్షల ఎకరాలకు సాగునీరందించే అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం 96శాతం పూర్తవడంతో పాటు నీటిని ఎత్తిపోసేందుకు మూడు భారీ మోటర్లను సైతం ఏర్పాటు చేశారు. సంపు నిర్మా ణం, మోటర్ల బిగింపు పూర్తి కావడం…
తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ నుంచి టన్నెల్ ద్వారా సర్జ్‌పూల్ ట్యాంకుల్లోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు అప్పటి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మోటార్లను ఆన్‌చేసి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఏండ్ల తరబడి ఎదురు చూసిన గోదారమ్మ రాకను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం రిజర్వాయర్ వద్దకు తరలివచ్చారు. పంపుల ద్వారా ఎగిసిపడుతున్న గోదావరి నీళ్లను చూసి మురిసి పోయారు. రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ నుంచి నీళ్లు ధారాళంగా రావడంతో రైతులు, జనం కేరింతలు కొట్టారు. జై కేసీఆర్, జై హరీశ్‌రావు, జై సతీశ్‌కుమార్ అనే నినాదాలతో హోరెత్తించారు.
96శాతం రిజర్వాయర్ నిర్మాణం పూర్తి
2007లో కేవలం 1.23టీఎంసీల సామర్థ్యంతో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి రిజర్వాయర్ పనులు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే సరికి కేవలం 10శాతం మేర మాత్రమే కట్ట పనులు జరిగాయి. 2015లో స్వయంగా రిజర్వాయర్‌ను సందర్శించిన అప్పటి సీఎం కేసీఆర్ దీని సామర్థ్యాన్ని లక్షా ఆరు వేల ఎకరాలకు సాగునీరందించేలా 8.23టీఎంసీలకు పెంచి నిధులు కేటాయించారు. శరవేగంగా జరిగిన పనుల్లో భాగంగా 10.56 కి.మీ.ల పొడవు, 17మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం పూర్తయింది. 3,836ఎకరాల భూసేకరణ జరగగా 937మంది భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1100కోట్ల నిధులు కేటాయించింది. కుడి కాలువ పనులు అప్పటికే కొంతమేర పూర్తి కాగా, ఎడమ కాలువ పనులు మాత్రం మిగిలాయి. రిజర్వాయర్ నిర్మాణం సుమారు 96శాతం పూర్తయింది. దీంతో పాటు రూ.770కోట్ల నిధులతో 12కి.మీ.ల మేర టన్నెల్, సర్జ్‌పూల్ ట్యాంకులు, పంపుహౌస్, మూడు భారీ మోటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవడంతో మోటర్లను ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు.
సాంకేతికంగా పూర్తి స్థాయిలో పనులు అయ్యాక జూన్ 29, 2023 రోజున మరోసారి మోటర్లను ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. సుమారు టీఎంసీ నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసులతో నీటి విడుదలకు బ్రేక్ పడింది. మరో రెండు టీఎంసీల నీరు నిండితే హుస్నాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి వందలాది ఎకరాల్లో పంటలు పండేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వాయర్ ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్ ఎడమ కాలువ నిర్మాణానికి రూ.431 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. భూసేకరణ ప్రక్రియ అంతంతమాత్రంగానే నడుస్తున్నది. కొందరు భూనిర్వాసితులను రెచ్చగొట్టి గ్రీన్ట్రిబ్యునల్లో కేసులు వేయించి రిజర్వాయర్ పనులు, నీటి విడుదలను అడ్డుకునేలా చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని హుస్నాబాద్ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు.
కాలువల నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా చడీచప్పుడు చేయక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నారు తప్ప పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మూడేండ్ల క్రితం గోదారమ్మ నీళ్లను కళ్లజూసిన మెట్ట రైతన్నలకు ఇంకా నిరాశే మిగిలినట్లయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కాలువల నిర్మాణ పనులు పూర్తి కావచ్చేవని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
రిజర్వాయర్ పనుల్లో పురోగతి శూన్యం…
బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ పనులు శరవేగంగా జరిగాయి. భూనిర్వాసితుల సమస్యలను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేశాం. రైతుల కోరిక మేరకు అధిక పరిహారం అందించాం. రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు నిల్వ ఉంచేందుకు కాళేశ్వరం నీళ్లను నింపాం. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయించిన కాంగ్రెస్ నాయకులు నీటి విడుదలను, రిజర్వాయర్ పనులు జరుగకుండా అడ్డుకున్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రిజర్వాయర్ పనులను పట్టించుకోవడం లేదు. పనుల్లో పురోగతి కరువైంది. నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. కాలువల నిర్మాణం పూర్తి చేసి నీళ్లందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు ఇప్పుడేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఏడాదిలోగా కాలువల నిర్మాణం పూర్తి చేసి హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి నీళ్లందించకుంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుంది.
– వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్