సంగారెడ్డి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు సహకరించడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై దాడులకు పూనుకున్నారు.
సంగారెడ్డిలోని 21వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీజేపీ అభ్యర్థి, కార్యకర్తలపై దాడిచేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ నేతృత్వంలో పోలీసులు లాఠీచార్జి చేసి గొడవలను అదుపులోకి తెచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు బీఆర్ఎస్ నాయకులతో ఘర్షణకు దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు ప్రయత్నించడంతో పాటు దొంగ ఓట్లు వేయించి ఎన్నికల్లో గెలిచే కుట్రలు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
సంగారెడ్డి పట్టణంలోని పలువార్డుల్లో కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో గొడవకు దిగారు. సంగారెడ్డి పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలతో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ చేశారు. 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థితో పాటు పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో ఘర్షణకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసం ఉండే 22వ వార్డులోని జేబీఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి, కార్యకర్తలతో గొడవ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా, ఆయన వెన్నపంటే పదుల సంఖ్యలో నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి విష్ణు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస నాయకుడు కిరణ్ గొడవకు దిగారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మద్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
23వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో గొడవ చేశారు. 25వ వార్డులో కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ అభ్యర్థి అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 32వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉండగా వారిని బయటకు లాగి గొడవకు దిగారు. 36వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. 30వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పక్షాన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాడంటూ ఓ నాయకుడిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అందోల్‌లో ఓ వృద్ధుడు ఓటరు జాబితాలో తన పేరు లేదని పోలింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. నారాయణఖేడ్ 6వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు ఎంపీ సురేష్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ బెదిరించారు. నారాయణఖేడ్‌లోని 8వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఏజెంట్‌ను బయటకు పంపి రిగ్గింగ్‌కు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పోలీసులను అప్రమత్తం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించారు.
చిట్కుల్లో అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరించడంతో బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు. ఇస్నాపూర్ 16వ వార్డులో కాంగ్రెస్ ఏజెంట్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఓటువేయాలని ప్రచా రం చేయటంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలింగ్ కేంద్రం నుంచి పం పించి వేశారు. ఇస్నాపూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పోలయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారని, పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డిలోని 30వ వార్డులోని రిషి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గొడవకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు మధ్య గొడవ చోటు చేసుకుంది. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.
జోగిపేట పట్టణంలో ఓ మహిళా ఓటరును పోలీసులు ఇబ్బంది పెడ్డటంతో పోలీసుల తీరుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జోగిపేట సీపీఎస్ స్కూల్ వద్ద మహిళ ఓటు వేసేందుకు రాగా, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఓవర్‌యాక్షన్ చేస్తున్నారని, మీకు చట్టాలు వర్తించవా అంటూ పోలీసులను మహిళ నిలదీసింది. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయి నా ఓటర్లు నిర్భయంగా ఉదయం నుంచి భారీ సంఖ్యలో క్యూలో నిలబడి ఓటు వేశారు. కాంగ్రెస్ నాయకులు దాడులు, బెదిరింపులకు దిగా రు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మెజా ర్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయం. మెదక్ మున్సిపాలిటీపై గులాబీజెండా ఎగురవేస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్
మెదక్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు, దాడులు చేసినా ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశా రు. మెదక్‌లో అధిక శాతం పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివచ్చి చైతన్యాన్ని చాటారు.
– శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ