మునిపల్లి, ఆగస్టు 30: కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్‌కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడి పోతున్నదని అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులోగల శ్రీసాయి గార్డెన్లో మునిపల్లి మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం, మంత్రుల మధ్య సఖ్యత లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అనేక హామీలు, ఆరుగ్యారెంటీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంప చెళ్లుమనేలా ప్రజలు బుద్ధి చెప్పాడం ఖాయం అని చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉన్నా దామోదర రాజనర్సింహ అందోల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే చేసిన అభివృద్ధి తప్ప మంత్రి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అందోల్ ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచి నియోజకవర్గాన్ని మంత్రి విస్మరించారన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సాయికుమార్,బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, మాజీ ఎంపీపీ చంద్ర య్య, మాజీ సర్పంచులు విశ్వనాథం పాటిల్, రమేశ్, శ్రీనివాస్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు మౌలానా, సీనియర్ నాయకులు శివశంకర్, కుతుబొద్దీన్, భాస్కర్, వెంకటేశం, పరశురాంగౌడ్, పాండు, విఠల్, సుల్తాన్, హఫీజ్, దత్తు పాల్గొన్నారు.