రాయపోల్, ఏప్రిల్ 1: సారూ.. మాకు పంట రుణమాఫీ ఎప్పుడు వస్తుంది. అందరికీ పంట రుణమాఫీ అయ్యింది అంటున్నారు. మాకు ఎందుకు కావడం లేదం టూ సిద్దిపేట జిల్లా రాయపోల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్తు అశోక్‌రెడ్డి మంగళవారం తన ఆవేదన వ్యక్తం చేశా డు. తాను కాంగ్రెస్‌లో మొదటి నుంచి పనిచేస్తున్నానని, అయినప్పటికీ తనకు రుణమాఫీ వర్తించలేదని ఆయన పేర్కొన్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న లోన్ డబ్బులు కట్టేశానని, మిగతా రెండు లక్షల రుణమాఫీ రాలేదని అశోక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు ప్రభుత్వానిదా..? లేక బ్యాంకర్లదా..? ఏమి అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరికీ రుణమాఫీ జరిగిందని ప్రచారం చేస్తున్నారని, కానీ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన తనకు రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగెత్తి పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడం తనకు నిరాశ కలిగిచిందని, తమ తోటి రైతులకు లక్షా 95 వేలు వరకు రుణమాఫీ చేశారని, తనకు రెండు లక్షల రుణమాఫీ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకూ రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆయన కోరాడు. ఇదే విషయమై సంబంధిత ఏవోను అడిగితే ప్రాసెస్‌లో ఉందని, రుణమాఫీ వస్తుందని జవాబు ఇస్తున్నారని అశోక్‌రెడ్డి పేర్కొన్నాడు.