మెదక్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిభయంతో కాంగ్రెస్ నేతలు గూండాగిరికి దిగుతున్నారు. మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ నాయకులు బూతులు తిట్టడం, చిల్లర రాజకీయాలు చేయ డం, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. వార్డులో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకుల పై వ్యక్తిగత విమర్శలతో పాటు కుటుంబసభ్యుల పై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మెదక్ పట్టణంలో కాంగ్రెస్ నేతల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గిన బుద్ధి చెప్పాలని, అప్పుడే మెదక్ పట్టణం ప్రశాంతంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రచార సభల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బెదిరించడంతోపాటు ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేయడం పై ప్రజలు భగ్గుమంటున్నారు. మెదక్ మున్సిపల్‌పై గులాబీజెండా ఎగురవేసేందుకు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఓటర్లు బహిరంగంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం,పోలీసులతో బెదిరింపులకు గురిచేయడంపై పట్టణ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు జరగలేదని ప్రజలు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై పోలీస్ కేసులు పెడ్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు.

మెదక్‌లో ప్రజాస్వామ్యం లేకుండా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను వ్యక్తిగతంగా బెదిరించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి మున్సిపాల్ పై గులాబీజెండా ఎగురవేస్తుందనే ధీమాతో ప్రజలు ఉన్నారు.గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు దేవేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించి ఓటర్ల వద్దకు వెళ్లే ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు గడిచినా ఇంతవరకు మెదక్‌ను అభివృద్ధి చేయలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించడం లేదు. మెదక్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా సమస్యల పరిష్కారం కోసం కృషిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎమ్మెల్యే వైఫల్యాలపై వార్డులో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన అభివృద్ధి పనులు పెండింగ్‌లో పెట్టారు. ముస్లింల కోసం షాదీఖాన నిర్మాణం చేస్తే అసంపూర్తిగా పనులు పూర్తి చేయడం లేదు. మెదక్ పట్టణంలో ఉన్న దయారా రోడ్డు పనులు పూర్తి చేయకుండానే అసంపూర్తిగా ఉంచారు.
మెదక్ మున్సిపాల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడంతో పాటు పోలీసులతో ఎన్నికల కోడ్ (నియమావళి) అమలు చేయడం లేదని కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ అమలు చేయకపోయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.ఎన్నికల నియమావళి అమలు చేసే అధికారులు అధికార పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే వార్డులో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.