Sangareddy | మునిపల్లి, మార్చి 15 : హలో సార్.. హలో మేడం.. మేము మంత్రి దామోదర రాజనర్సింహ తాలుకా మనషులం మా టిప్పర్లనే అడ్డుకుంటరా.. మాకెవ్వరు అడ్డు చెప్పేది అంటూ మునిపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరులు మునిపల్లి మండలంలో దర్జాగా మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయాలుగా నడిపిస్తున్నారు. మండలంలోని రెవెన్యూ అధికారులు పలుమార్లు మట్టి తరలిస్తున్న వాహనాలను నిలిపి జరిమనాలు విధిస్తే మంత్రి మనషుల బండ్లే అపూతారా అంటూ మండల రెవెన్యూ అధికారులకు సైతం ఫోన్లు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. దీంతో మునిపల్లి మండలంలో అక్రమ మొరం దందా యథేచ్చగా కొనసాగుతోంది. అక్రమార్కుల ధాటికి ముంబై జాతీయ రహదారికి అతి దగ్గరలోని గుట్టలు కనుమరుగైపోతున్నాయి.
మట్టికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో కొందరు వ్యాపారులు గుట్టలను కొల్లగొట్టి రాత్రీపగలు అనే తేడాలేకుండా మొర్రం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డు అదుపులేకుండా సాగుతున్న మొరం దందాపై సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు మునిపల్లి మండలంలో వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో మొరం తరలింపుతో అక్రమార్కులు తమ పనులను యథేచ్చగా సాగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లకు ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా పనులకు దగ్గరగానే అక్రమ క్వారీలను చేపడుతూ దూరపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతి ఓ చోట ఉంటే మొరం తవ్వకాలు మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారుల అండ దండలతో కొండ గుట్టలను తవ్వేస్తున్నారు. ఒక్కో గుట్టకు రోజుకు 100 ట్రిప్పుల వరకు టిప్పర్లతో అక్రమార్కులు అక్రమంగా మొరం తరలిస్తూ రోజుకు సుమారు రూ.లక్ష రూపాయలకుపైనే వెనుకేసుకుంటున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరిపే వ్యక్తులు ఎంతటివారైన సరే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మండల వాసులు అధికారులను కోరుతున్నారు.
మండలంలోని పలు ప్రాంతాల్లో మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. మా వద్ద నుంచి ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా మొరం తరలిస్తున్న వారు ఎవ్వరైనా సరే కేసులు నమోదు చేసి మొరం తరలించే వాహనాలకు జరిమనాలు విధించడం జరుగుతుంది. గత కొద్దీ రోజుల క్రితం మునిపల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించినట్లు తెలిపారు. మండల కేంద్రమైన మునిపల్లికి గ్రామ శివారులో జరుగుతున్న రోడ్డు పనులకు మొరం అవసరం ఉన్నట్లు ఆర్అండ్బి అధికారులు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండలంలో ఎక్కడైన అక్రమ మొరం తవ్వకాలు జరిపితే మండలం నుంచి ఇతర మండలాలకు తరలిస్తే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలి అని తహసీల్దార్ సూచించారు.