అక్కన్నపేట, మే 7: ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సులకు కాంగ్రెస్ నాయకులు హాజరై వేదికపై అధికారులకు సమానంగా కూర్చుంటున్నారు. ఇది చూసినా స్థానికులు కాంగ్రెస్ సభనా… రెవెన్యూ సదస్సా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేదికపైన అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉండటంతో భూసమస్యల గురించి అధికారులకు వివరించేందుకు కూడా బాధిత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రైతుల దరఖాస్తులు, భూ సమస్యల గురించి అధికారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
37 గ్రామ పంచాయతీలు.. మూడు రెవెన్యూ టీంలు..
భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేశారు. మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా, అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్‌రెడ్డి, సురేఖ ఆధ్వర్యంలో మూడు రెవెన్యూ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ సంబంధిత సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ సదస్సులను హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి రోజువారీగా పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి ఆదేశాలు?
అక్కన్నపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేయడంతో రెవెన్యూ సదస్సులకు కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యనాయకులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో మండలంలోని మూడు రెవెన్యూ టీంల ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు ఆయా గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు వెళ్లి అధికారుల పక్కకు కూర్చుంటున్నారు. దీంతో అధికారులతో పాటు నాయకులు కూడా వేదికపై ఉండటంతో భూ సమస్యలు చెప్పేందుకు కొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకుల ఇంట్లో వంటచేయడంతో మధ్యాహ్నం అధికారులు వారి ఇండ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నట్లు తెలిసింది.